ప్రత్యామ్నాయ పంటలతోనే అధిక లాభాలు పొందవచ్చని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన ఓ యువ రైతు నిరూపిస్తున్నాడు. ఒక్క మిర్చి పంట మాత్రమే సాగుచేసి, రూ. 6 లక్షలు ఆర్జించాడు. ఊహించని లాభాలు అందుకొని.. రైతు తలచుకొంటే సాగులో అద్భుతాలు సృష్టించవచ్చని చెబుతున్నాడు.
తెలంగాణలో సాగు నీరు పెరగడంతో రైతులంతా వరివైపు మళ్లారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దమొత్తంలో వరి దిగుబడి వచ్చింది. అయితే, ధాన్యం కొనుగోలుకు కేంద్రం ముందుకు రాకపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మారాలని ప్రభుత్వం సూచించింది. వ్యవసాయ శాఖ అధికారులు సమావేశాలు నిర్వహించి, ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించారు. అధికారుల సూచనతో కొందరు రైతులు పంటమార్పిడి చేశారు. తమ భూముల రకాలను బట్టి పంటలను ఎంచుకున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే పంటలను సాగుచేసి, ఆశించిన ఫలితం పొందారు.
మిర్చితో ఆరు లక్షలు..
ప్రభుత్వ సూచనతో కొలనూర్ గ్రామానికి చెందిన సల్పాల సంపత్ అనే యువరైతు పంట మార్పిడికి ముందుకొచ్చాడు. వరికి బదులుగా మిర్చి సాగుచేశాడు. తనకు ఎకరంనర భూమి ఉండగా, ఎకరంలో మిర్చి పంట వేశాడు. గత సెప్టెంబర్‌లో మొక్కలు నాటాడు. దాదాపు రూ. 1.68లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. నాలుగున్నర నెలల్లోనే పంట చేతికి రాగా, 30 క్వింటాళ్ల దిగుబడి అందుకున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మిర్చి పంటకు మంచి డిమాండ్ వచ్చింది. వారం, వారం పచ్చిమిర్చిని తెంపి స్థానిక అంగడిలో విక్రయించాడు. ఎండుమిర్చిని గ్రామాలు, పట్టణాల్లో అమ్మాడు. క్వింటాల్‌కు రూ.20వేలు దాకా వచ్చింది. ఇలా రూ. 1.68లక్షల పెట్టుబడి పెడితే, దాదాపు రూ.6 లక్షల వరకు ఆదాయం ఆర్జించాడు.
అధికారుల సూచనతోనే
ఎప్పుడూ వరి వేసి, ధాన్యం అమ్మడానికి ఇబ్బంది పడేవాణ్ని. అధికారుల సూచనతో వేరే పంట వేయాలని నిర్ణయించుకున్నా. డిమాండ్ ఉన్న మిర్చి సాగు చేశా. మిర్చి పంటతో ఇంత లాభం వస్తుందని మొదట్లో ఊహించలేదు. పెట్టుబడికి మూడింతల లాభం వచ్చింది. చెప్పలేని సంతోషం కలుగుతున్నది. దీంతో పంటల మార్పిడే సరైన విధానమని తెలిసి వచ్చింది. రైతులంతా ఒకే రకమైన పంట కాకుండా, ఇతర పంటలను సాగు చేస్తే మంచిది.
-సల్పాల సంపత్, యువరైతు, కొలనూర్ (ఓదెల)
…? బాలసాని శ్రీనివాస్