నమస్తే సర్! పదెకరాల్లో చెరకు తోట వేశాను. ఈ మధ్య ఆకుల అడుగుభాగంలో నారింజ రంగులో బొబ్బలు కనిపిస్తున్నాయి. తెలిసినవాళ్లు అది తుప్పు తెగులు అని చెబుతున్నారు. దీనికి నివారణ మార్గాలు చెప్పండి.
-నారాయణ, బోధన్.
చలికాలంలో చెరకు తోటలను ‘తుప్పు తెగులు’ తీవ్రంగా నష్టపరుస్తుంది. చల్లటి వాతావరణం, మంచు వల్ల గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు తెగులు మరింతగా వృద్ధి చెందుతుంది. పంట తొలిదశ నుంచి తోట నరికే వరకూ.. ఏ దశలోనైనా ఈ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. నత్రజని ఎరువును అధిక మోతాదులో వాడితే.. తెగులు ఉధృతి మరింత పెరుగుతుంది.
తెగులు సోకిన మొక్కల్లో ఆకు అడుగుభాగంలో పసుపు లేదా నారింజ రంగులో బొబ్బలు ఏర్పడతాయి. ఒక మొక్క నుంచి దుబ్బులో ఉండే అన్ని మొక్కలనూ ఆశిస్తుంది. ఇలా చేనులో సుమారు 70% మొక్కలకు తెగులు వ్యాపిస్తుంది. తీవ్రత ఎక్కువైతే.. ఆకు తొడిమల మీద కూడా తుప్పు తెగులు బొబ్బలు కనిపిస్తాయి. దూరం నుంచి చూస్తే.. తెగులు సోకిన మొక్కలు ముదురు గోధుమ రంగులో కనిపిస్తాయి. దీని నివారణ కోసం లీటర్ నీటిలో 3 గ్రా. మాంకోజెబ్ లేదా ఒక మి.లీ. ట్రైడిమార్ఫ్ కలిపి పిచికారీ చేసుకోవాలి.