Milk Fever in cattle | పాలిచ్చే ఆరోగ్యవంతమైన పాడి పశువుల్లో రక్తంలోని కాల్షియం పరిమాణం ఆకస్మాత్తుగా తగ్గిపోవడం, తద్వారా రక్తప్రసారంలో అంతరాయం, కండరాల బలహీనత, వెనుకకాళ్ళ పడిపోవడం, ఆపస్మారకస్థితికి లోనై మరణించడం జరుగుతుంది. పోషక లోపం వల్ల ఇలా జరుగుతుంది. దీనినే పాలజ్వరం అని పిలుస్తుంటారు. దీనికి సకాలంలో చికిత్స అందిస్తే పశువులు బతికి బయటపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా జఫార్ బాడి, జెర్సీ ఆవుల్లో ఈ జ్వరం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పాల జ్వరం ఎందుకు వస్తుంది..? చికిత్స ఎలా ఉంటుంది..? నివారణ మార్గాలు ఉన్నాయా..? అనే విషయాలపై అవగాహన ఉండాలి.
వేటిలో వస్తుంది..?
పశువులు ఈనిన మొదటి వారంలో.. ముఖ్యంగా 2,3 రోజుల్లోనే ఈ జ్వరం సంభవిస్తుంది. సాధారణంగా 5-10 ఏండ్ల వయసున్న పాడి పశువుల్లో 3-7 ఈతల మధ్య ఈ వ్యాధి కనిపిస్తుంది.
లక్షణాలెలా ఉంటాయి..?
వ్యాధి లక్షణాలు 3 దశల్లో ఉంటాయి. మొదటి దశలో మేత సరిగ్గా మేయకపోవడం, నెమరు వేయకపోవడం, పళ్ళు కొరుకుతూ బెదురు చూపులతో చికాకుగా ఉంటాయి. వణకుతూ కదలడానికి కూడా ఇబ్బంది పడతాయి. వ్యాధి ప్రారంభంలో శరీర ఉష్ణోగ్రత మామూలుగా ఉండి, ఆతర్వాత సాధారణ స్థాయి కంటే తగ్గి ఒల్లంతా చల్లబడుతుంది.
తర్వాత దశలో పశువులు నిలబడలేకపోతాయి. శ్వాస, నాడి తగ్గి పశువులు కదలకుండా ఉండిపోతాయి. ఈ స్థితిలో పశువులు తలను పొట్టపై డొక్కలో ఆనించి “S” ఆకారంలో మగతగా పడుకుని ఉంటాయి. వ్యాధి చివరిదశలో శ్వాస, నాడివేగం పడిపోతుంది. పశువు ఒకవైపు పడిపోవడం, తద్వారా కడుపు ఉబ్బరం లక్షణాలు కనిపిస్తాయి. కండరాల వణకుతో చలనం లేకుండా, అపస్మాకర స్థితిలోకి వెళ్తాయి. వైద్యం వెంటనే అందించకపోతే పశువులు చనిపోతాయి.
చికిత్స ఎలా..?
పాల జ్వరం వచ్చినట్లు నిర్ధారణ కాగానే కాల్షియం బోరూ గ్లూకొనేటు ఇంజెక్షన్ 400-800 మి.లీ. ఇవ్వటం ద్వారా 75 నుంచి 85 శాతం పాడి పశువుల్ని రక్షించుకోవచ్చు. అవసరమైతే రోజు వ్యవధిలో 3 సార్లు ఇంజెక్షన్ ఇవ్వాలి. పశువులు ఈనడానికి 24 గంటల ముందు, ఈనిన 10 గంటల తర్వాత రోజుకు 3సార్లు 150 గ్రా.ల కాల్షియం తాగించడం ద్వారా పాల జ్వరం రాకుండా జాగ్రత్త పడవచ్చు. చూడి, పాడి పశువులు అనవసరపు ఉద్రేకాలకు గురికాకుండా చూడాలి. దాణాలో జొన్నలు పెట్టడం చాలా మంచిది.
నివారణ ఎలా..?
పశువులు ఈనగానే కాల్షియంతో కూడిన ఇంజెక్షన్లు, ఈనడానికి 5 రోజుల ముందు నుంచి డీ విటమిన్ ఇంజక్షన్లు ఇవ్వాలి. ఎక్కువగా పాలిచ్చే పశువులు ఈనిన తర్వాత మొదట్లో పాలు పూర్తిగా పితక్కుండా చూసుకోవాలి. పశువులను చలి నుంచి రక్షించాలి. వ్యాధి నివారణకు అమ్మోనియం క్లోరైడ్ 25 గ్రా చొప్పున చూలి చివరి వారాల్లో అందిస్తూ, ఈనే సమయానికి 100 గ్రా. చొప్పున నిత్యం అందించాలి.