e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home వ్యవసాయం అంతర్గాం.. ఉద్యాన సిరులు!

అంతర్గాం.. ఉద్యాన సిరులు!

అంతర్గాం.. ఉద్యాన సిరులు!

ఎవుసం తీరు మారుతున్నది. మన రైతులు తెలివితో సాగు చేస్తున్నారు. ఉపాయంతో ఉద్యాన తోటల్ని పెంచుతున్నారు. లాజిక్‌తో లాభాలు గడిస్తున్నారు. మోటు వ్యవసాయానికి, మూస పద్ధతులకు స్వస్తి పలికి ఉద్యాన సిరులు పండిస్తున్నారు. అలాంటి ఒక ఆదర్శ గ్రామమే అంతర్గాం. ఎనిమిది రకాల పండ్ల తోటలతో జగిత్యాల జిల్లాలోనే ‘హార్టికల్చర్‌ హబ్‌’ గుర్తింపు పొందిన ఆ రైతుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది!

జగిత్యాల జిల్లా రైతులు సాంప్రదాయేతర పండ్ల తోటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో మండలంలో ఒక్కో తీరు సాగు విధానాలను అనుసరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతర్గాం నుంచి మొదలుపెడితే మల్యాల మండలం గొర్రెగుండం వరకు ప్రతీ రైతుకొక ప్రత్యేకత ఉంటుంది. అందరూ ఆధునిక సాగు విధానాలు అవలంబిస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నవారే. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయాన్నిచ్చే తోటలను సాగు చేస్తున్నారు.

ఎనిమిది రకాల తోటలు

అంతర్గాం-గొర్రెగుండం గ్రామాల మధ్య ఎనిమిది రకాల పండ్ల తోటలు సాగుచేస్తున్నారు. శతాబ్దాల కాలం నుంచి ఈ ప్రాంతాలు మామిడితోటలకు పేరు పొందాయి. కాలగమనంలో మామిడి తోటల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్వకాలానికి సంబంధించిన మామిడితో పాటు, బంగినపల్లి, హిమాయత్‌, మల్లిక, దశేరీ రకాలకు చెందిన చెట్లను పెంచుతున్నారు. ఈ ప్రాంతం నుంచి విదేశాలకు మేలురకమైన మామిడికాయలు ఎగుమతి అవుతున్నాయి. ఎస్సారెస్పీ కాలువ నీరు రావడం, కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారంగా, ఎస్సారెస్పీ పునరుజ్జీవం విధానం అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలో నీటి వసతి పుష్కలంగా ఉంది. దీంతో రైతులు కొత్త పంటలను సాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్గాం గ్రామంలో ప్రస్తుతం నాలుగు రకాల పండ్లతోటలు సాగవుతున్నాయి.

ఆదర్శ రైతు సుభాష్‌

గ్రామంలో సుభాష్‌రెడ్డి అనే రైతు రెండెకరాల్లో డ్రాగన్‌ఫ్రూట్‌ సాగు చేస్తున్నాడు. తెలంగాణలో డ్రాగన్‌ఫ్రూట్‌ను సాగు చేసి, ఫలసాయం పొందిన తొలి వ్యక్తిగా సుభాష్‌రెడ్డి గుర్తింపు పొందాడు. అలాగే తైవాన్‌ జామతో పాటు, సాంప్రదాయ జామతోటలను సైతం సుభాష్‌రెడ్డి ఐదెకరాల్లో సాగు చేస్తున్నాడు. గతేడాది నుంచి ఏడాదికి మూడు దఫాల్లో సుభాష్‌రెడ్డి జామ పంట సాయాన్ని పొందుతున్నాడు. ఐదు ఎకరాల్లో సీతాఫలం తోట సాగు చేస్తున్నాడు. ఇప్పటికే గ్రామంలో దాదాపు యాభై ఎకరాల్లో అరటి తోటలు సాగవుతున్నాయి. అరటితోటలతో పాటు, బొప్పాయి తోటలు సైతం గ్రామంలో పెద్ద విస్తీర్ణంలో సాగవుతున్నాయి.

గొర్రెగుండంలో ఆపిల్‌బేర్‌

గొర్రెగుండం గ్రామానికి చెందిన సాయిని వేణుగోపాల్‌ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తెలంగాణ ప్రాంతానికి అనుకూలమైన వాతావరణంలో తట్టుకునే జామ, ఆపిల్‌ బేర్‌ తోటలను పరిశీలించాడు. ఐదెకరాల్లో మామిడి ప్రత్యామ్నాయంగా ఆపిల్‌బేర్‌ను ఎంచుకున్నాడు. ఆపిల్‌ బేర్‌కు సంబంధించిన మొక్కల రకం తైవాన్‌ బర్‌లో ఎరుపు, ఆకుపచ్చ రెండు రకాలు ఉండగా, ఆకుపచ్చ రకం కాయలు వచ్చే మొక్కలను సాగు చేస్తున్నాడు. ఏడాదిలో రెండుసార్లు ఫలసాయాన్ని పొందడానికి, కొంత కృషి చేస్తే ఏడాదంతా, ఫల సాయం పొందేందుకు సైతం అవకాశాలున్నాయని పేర్కొన్నాడు వేణుగోపాల్‌. ఆపిల్‌ బేర్‌ కాయల పరిణామాన్ని బట్టి, మార్కెట్‌లో రెండు రకాలుగా పేర్కొంటారు. వంద గ్రాములు పైచిలుకు ఉంటే ఏ గ్రేడ్‌గా, అంతకు తక్కువ బరువు ఉంటే బీ గ్రేడ్‌గా చెబుతారని, ఏ గ్రేడ్‌కు మంచి ధర పలుకుతుందని, బీగ్రేడ్‌ కాయలకు కొంత తక్కువ ఆదాయం వస్తుందంటున్నాడు. మామిడి ఎకరానికి 40 చెట్లు వస్తే, ఆపిల్‌బేర్‌ 90 నుంచి 100 వరకు వచ్చే అవకాశం ఉంటుందని, దిగుబడి రీత్యా కూడా ఒక్కో ఆపిల్‌ బేర్‌ చెట్టు నుంచి 20కిలోల వరకు వచ్చే అవకాశం ఉంటుందన్నాడు. గొర్రెగుండం గ్రామ శివారులో సాయిని వేణుగోపాల్‌తో పాటు రామన్నపేట గ్రామానికి చెందిన మరో రైతు బొడిగె గంగనర్సయ్య తనకున్న పదెకరాల్లోనూ ఆపిల్‌ బేర్‌ తోటలను సాగుచేస్తున్నాడు.
… కొత్తూరి మహేశ్‌ కుమార్‌, జగిత్యాల, నమస్తే తెలంగాణ

తక్కువ కాలంలో లబ్ధి

మామిడి తోటకు ఆశించిన దిగుబడి రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించా. ఈ క్రమంలోనే నాకు తెలిసిన వారి నుంచి దానిమ్మ, సంత్ర, జామ, ఆపిల్‌ బేర్‌ మొక్కల గురించి విన్న. వీటిని సాగు చేస్తున్న పలు క్షేత్రాలను సైతం సందర్శించా. ఈ నాలుగింటిలో ఆపిల్‌ బేర్‌ మొక్కలను ఎంపిక చేసుకొని ఐదెకరాల్లో సాగు చేశా. మొక్కలు నాటిన నెలల కాలంలోనే కాయలు కాస్తాయి. కావున రైతులకు ఆర్థికంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.
సాయిని వేణుగోపాల్‌, గొర్రెగుండం

ఆసక్తి పెరుగుతున్నది

సేద్యానికి అనుకూల వాతావరణం జగిత్యాల జిల్లాలో పుష్కలంగా ఉంది. కాళేశ్వరం నీరు అందుబాటులోకి రావడంతో భూగర్భ జలాలు సైతం పెరిగిపోయి రైతులు గతంలో బీడు పెట్టిన భూముల్లో సైతం సేద్యం చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యానవన పంటలు, కూరగాయల సాగుపై సైతం వారు ఆసక్తి చూపుతున్నారు. అంతర్గాం గ్రామంలోనే మొట్టమొదటి సారిగా ఓ యువ రైతు డ్రాగన్‌ ఫ్రూట్‌ పంటను, అలాగే జామ, సీతాఫల తోట సాగు చేస్తున్నాడు. ఇప్పటికే అంతర్గాంలో బొప్పాయి, అరటి తోటలు సాగవుతున్నాయి. అంతర్గాం గ్రామానికి ఎగువన ఉన్న గొర్రెగుండం గ్రామంలో రైతులు ఆపిల్‌బేర్‌ తోటను సాగు చేస్తున్నారు. ధర్మపురి, జగిత్యాల మండలం ఉత్తర ప్రాంతంలోని గ్రామాల్లో క్యాబేజీ, వంకాయ, బీరకాయ, చిక్కుడు కాయ, కాకరకాయ, ఆకుకూరలను సాగు చేస్తున్నారు. రైతుల దృక్పథంలో మార్పురావడం సంతోషంగా ఉంది. ప్రతాప్‌సింగ్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అంతర్గాం.. ఉద్యాన సిరులు!

ట్రెండింగ్‌

Advertisement