పంట కోత అనంతరం వివిధ ధాన్యాలు, పప్పు దినుసులు, పల్లీలు, మక్కలను నిల్వచేయడం చాలా ముఖ్యమైనది. సరైన విధానంలో ధాన్యం నిల్వ చేయకపోవడం కారణంగా 15-40 శాతం వరకు నష్టం జరుగుతున్నది. ప్రధానంగా బ్రుచిడ్ పురుగుల వల్ల పుచ్చులు ఏర్పడి, తినడానికి పనికిరావు. నాణ్యత ఉండదు. మొలక శాతం తగ్గిపోతుంది. అమ్మే సమయంలో ధర రాదు.
సంప్రదాయ పద్ధతుల్లోని సమస్యలను అధిగమించేందుకు అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయం కనుగొన్న ‘పర్డ్యూ ఇంప్రూవ్డ్ క్రాప్ స్టోరేజ్ (పీఐసీఎస్)’ టెక్నాలజీతో తయారైన సంచులు మనదేశంలోకి అందుబాటులో వచ్చాయి. వీటిని వాడకం చాలా మంచిదని నిపుణులు సెలవిస్తున్నారు.
పిక్స్ (పీఐసీఎస్) సంచులు పంట కోత అనంతరం పురుగుల తాకిడికి గురై నష్టపోకుండా గింజలు, ధాన్యాలు, పప్పు దినుసులు ఇతర వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను కాపాడేవి. వీటిని ముఖ్యంగా వరి, గోధుమ, కంది, సజ్జ, జొన్న, పెసర, మినుము, మక్కజొన్న, పల్లి, మిరప, నువ్వుల నిల్వలకు సమర్థవంతంగా వాడుకోవచ్చు. మొదటిసారిగా పశ్చిమాఫ్రికా దేశంలో బొబ్బర్ల నిల్వకు ఈ సంచులను వాడారు. తర్వాత ఆసియా, ఇతర ఆఫ్రికా దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షల PICS సంచులను రైతులు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో పీఐసీఎస్ పరిజ్ఞానాన్ని తెలుసుకొని సక్రమంగా వాడుకునే విధానం తెలుసుకుందాం.
పిక్స్ సంచుల గురించి..
ఇవి గాలి చొరబడని మూడు పొరల సంచులు. లోపలి రెండు పొరలు 80 మైక్రాన్ల మందం కలిగి ఉంటాయి. ఇవి అధిక సాంద్రత కలిగిన పాలిఎథిలీన్తో తయారు చేయబడినవి. మూడో పొర- పాలిప్రొఫిలీన్తో తయారు చేయబడినది. ఈ మూడు కలిస్తేనే పురుగులు, శిలీంద్రాలు నిర్మూలించే శక్తి కలిగి ఉంటాయి. ఈ సంచిలో ఆక్సిజన్ అందుబాటులో ఉండదు. కార్బన్-డై-ఆక్సైడ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఫలితంగా లోపల నిల్వ చేసిన ఉత్పత్తులలోని పురుగులకు ఆక్సిజన్ అందక చనిపోతాయి.
సంచులు వాడే కాలం పెంచేందుకు
– చెత్తలేని ఉత్పత్తులను మాత్రమే నిల్వ చేయాలి. ఉత్పత్తులు లోపలి పొరలకు రంధ్రం చేయకుండా ఉండాలి.
– సంచులను ముడి వేసేటప్పుడు, రవాణా చేసేటప్పుడు సంచుల పొరలు దెబ్బతినకుండా చూసుకోవాలి.
– శుభ్రమైన గదులలోనే భద్రపరుచాలి. ఎలుకలు, ఇతర కీటకాలు లేకుండా నిర్మూలించాలి. ఎలుకలు కొడితే ఈ సంచులు అసలు పనిచేయవు.
– అధిక ఉష్ణోగ్రత లేకుండా చూసుకోవాలి. సంచులపై నేరుగా సూర్యరశ్మి పడకుండా చూసుకోవాలి.
– సంచికి చిన్న, సన్న రంధ్రాలు ఉంటే ఎప్పటికప్పుడు టేప్‌తో అతికించి గాలి చొరబడకుండా చూసుకోవాలి.
ఈ సంచులు ఉపయోగించేటప్పుడు చేయవలిసినవి
– నమ్మదగిన డీలర్ల వద్ద నాణ్యమైన సంచులను కొనాలి. నాణ్యతే ముఖ్యం. సంచుల పొరలు నాణ్యత లేకుంటే ధాన్యం నిల్వకు పనికిరావు.
– నిల్వ చేసే ధాన్యంలో నిర్దేశించిన 8-10 శాతం తేమ శాతం ఉండేటట్టు చూసుకోవాలి.
– ఈ సంచులు అధిక తేమతో కూడిన ఉత్పత్తులు నిల్వ చేస్తే పనిచేయవు. సంచుల లోపలి రెండు పొరల్లో చిల్లులు లేకుండా చూసుకోవాలి.
చేయకూడనివి
– సంచులను ఎండలో నిల్వ చేయవద్దు.
– మధ్య మధ్యలో అంటే నిల్వ సమయంలో సంచులు తెరువరాదు.
– గోడల పక్కన పెట్టకూడదు.
– మూడు సంచులను విడివిడిగా వాడితే పనిచేయవు.
రీసైక్లింగ్
– ఈ సంచులు మూడు, నాలుగేండ్లు వాడిన తర్వాత మళ్లీ ఉత్పత్తుల నిల్వకు వాడకపోవడమే మంచిది. అయితే చివరి పొర సంచిని రైతులు ఇతర అవసరాలకు వాడుకోవచ్చు.
– చాపలు, తాడుల తయారీకి కూడా వాడుకోవచ్చు.
– హెచ్డీపీఈ పొరలను స్థాని క ఆహార రెస్టారెంట్లలో ఆహార పదార్థాల నిల్వకు వాడుకోవచ్చు.
– వాటర్ ప్రూఫ్ మెటీరియల్‌గా కూడా వాడుకోవచ్చు.
– ఈ సంచులలో పురుగు మందులు పిచికారీ చేయరు. కాబట్టి ఇండ్లలోనూ ఇతర అవసరాలకు వీటిని మళ్లీ ఉపయోగించుకోవచ్చు.
– చాలామంది రైతులు ధాన్యం అమ్మేటప్పుడు సంచులతో సహా అమ్మరు. వేరే డబ్బాలలో పోసి, అనంతరం విక్రయిస్తారు. కాబట్టి ఆ సంచులను బాగా శుభ్రం చేసి మళ్లీ ధాన్యం నిల్వ చేసుకోవడానికి వాడుకోవచ్చు.
గాలి చొరబడని సంచులు
సాధారణంగా రైతులు తమ ధాన్యాన్ని, విత్తనాన్ని పురుగు పట్ట కుండా, బూజు రాకుండా కాపాడటానికి వివిధ పద్ధతుల ద్వారా నిల్వ చేసుకుంటారు. గోనె సంచి, ఎరువుల సంచి, మట్టి తో లేదా లోహంతో చేసిన డ్రమ్ములో నిల్వ చేస్తారు. ఇలా చేసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో ధాన్యంలో పురుగు పుట్టి, అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల 15-50 శాతం వరకు ధాన్యంలో నష్టం వస్తుంది. నాణ్యత, బరువు తగ్గడం, బూజు శిలీంద్రాలు అభివృద్ధి చెందడం వల్ల మార్కెట్లో అమ్మేటప్పుడు రైతుల ఉత్పత్తులకు సరైన ధర లభించదు. (అసలైతే పంట కోతకు వచ్చిన సమయం కంటే ఆ తర్వాత నిల్వ చేసి అమ్మితే ఎక్కువ గిట్టుబాటు ధర రైతుకు రావాలి). దీనివల్ల అనేక నష్టాలు ఉన్నాయి. 1) రైతులు కోత సమయంలోనే తమ పంటను తక్కువ ధరకు అమ్ముకోవడం 2) గోనె సంచిపై పురుగు మందు చల్లడం 3) పురుగు మందులతో ధాన్యాన్ని నిల్వచేయడం. ఇటువంటి సమస్యలన్నీ అధిగమించడానికి ఈ పీఐసీఎస్సంచులను ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. ఈ టెక్నాలజీలో గాలి చొరబడని మూడు పొరల సంచులను వినియోగిస్తారు. జీవరాశులన్నింటికీ (పురుగులు కూడా) ప్రాణవాయువు ఆధారం. ఎప్పుడైతే ప్రాణవాయువు కావలసిన మోతాదులో ఉండదో పురుగుల అభివృద్ధి ఆగిపోతుంది. ఈ టెక్నాలజీలో ఇదే ప్రధాన సూత్రం.
పల్లీల నిల్వకు
ఇక్రిశాట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హరికిషన్ సూదిని మొదటిసారిగా 2011 నుంచి భారతదేశంలో పల్లీల నిల్వ కోసం ఈ సంచుల ను ఉపయోగించడంపై పరిశోధనలు చేయడం ప్రారంభించారు. పర్డ్యూ యూనివర్సిటీ సహకారంతో సాగిన ఈ పరిశోధనలు సత్ఫలితాలు ఇచ్చాయి. దీంతో అనంతపురం జిల్లాలోని కొద్దిమంది ఎంపిక చేసిన రైతులకు ఈ మూడు పొరల సంచులను ప్రయోగాత్మకంగా ఇచ్చి వారిని పల్లి నిల్వకు ఉపయోగించమని ప్రోత్సహించారు. ఆ తర్వాత రైతుల అభిప్రాయాలను సేకరించినప్పుడు వారు ఈ సంచులు చాలా బాగా పనిచేశాయని చెప్పారు. సంప్రదాయ పద్ధతిలో జనపనార/గోనె సంచులను ఉపయోగించి పల్లి కాయలను నిల్వ చేసినప్పుడు, బ్రుచిడ్ అనే పురుగు త్వరితగతిన వృద్ధి చెంది, తీవ్ర నష్టం కలుగజేస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ మూడు పొరల సంచులను ఉపయోగించినప్పుడు కీటకాలను సమర్థవంతంగా నిలువరించి, పల్లికాయల నాణ్యతను కాపాడుకోవచ్చని తేలింది. అంతేగాకుండా పల్లిలో విత్తన మోతాదు అధికం. ఎకరానికి దాదాపు 60-80 కిలోల విత్తనం వాడాలి. రైతులు తాము పండించిన పల్లి కాయలను మళ్లీ వచ్చే కాలానికి అంటే దాదాపు 6-8 నెలల వరకు ఈ సంచులలో నిల్వ చేసుకున్నట్లయితే విత్తనంపై పెట్టే ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చు. ఇక్రిశాట్ వారి పరిశోధనలో విత్తన మొలక శాతం కూడా ఏ మాత్రం తగ్గకుండా ఈ సంచులు పల్లి కాయలను కాపాడినట్లు తేలింది. నల్లబూజును కూడా సమర్థవంతంగా తగ్గించింది.
ఏయే పంటల ఉత్పత్తుల నిల్వకు వాడుకోవచ్చు
– మూడు పొరల ప్లాస్టిక్ సంచులను నిల్వలో ఆశించి, నష్టపరిచే పురుగులు, తెగుళ్ల నివారణకు సమర్థవంతంగా వాడుకోవచ్చు.
– బొబ్బర్లు, ఉలవల నిల్వలో బ్రుచిడ్ (గింజ పుచ్చు)లను నివారించేందుకు వాడుకోవచ్చు.
– మక్కజొన్నల నిల్వలో బీటిల్స్, పుచ్చు, నల్లబూజు నివారించేందుకు వాడుకోవచ్చు.
– వరి, గోధుమ గింజలలో పుచ్చు పురుగు నివారణకు వాడుకోవచ్చు.
– కంది, మినుము, పెసర్లలో బ్రుచిడ్, పుచ్చులు నివారించేందకు వాడుకోవచ్చు.
– పల్లి నిల్వలో కాయలు, గింజలను ఆశించి నష్టపరిచే బ్రుచిడ్, నల్లబూజు, అఫ్లాటాక్సిన్‌ను పూర్తిగా నివారించేందుకు వాడుకోవచ్చు.
– సోయబీన్, శనగలు, పెద్ద బొబ్బర్లు, చిక్కుడు విత్తనాలు పుచ్చలుకుండా ఉండేందుకు వాటిని మూడు పొరల సంచులలో నిల్వ చేసుకోవాలి.
– సజ్జ, జొన్న, రాగి, కొర్రలు, సామలు, తైదలు పుచ్చిపోకుండా కూడా ఈ పిక్స్ సంచులలో నిల్వ చేసుకోవచ్చు.
– మిరప నిల్వలో ఆశించే నల్లబూజు నివారణకు వీటిని వాడుకోవచ్చు.
– పసుపు, కారం, పొడులను నిల్వ చేసుకోవచ్చు. పురుగు ఆశించదు.
ఎంత కాలం నిల్వ చేసుకోవచ్చు
పంట కోత అనంతరం ఆహారధాన్యాలు, గింజలు, అపరాలు, పల్లీలు, నువ్వులు, విత్తనాలలోని తేమ శాతాన్ని 8-10 శాతానికి తగ్గించి మూడు పొరల సంచులలో నిల్వ ఉంచాలి. మధ్య మధ్యలో సంచులు తెరువకుండా రెండు, మూడు ఏండ్ల వరకు ఒక్క పుచ్చు కూడా లేకుండా నిల్వ చేసుకోవచ్చు. నిల్వకు ముందు కొన్ని పుచ్చులున్నా మిగతా వాటికి ఆ పురుగు సోకకుండా సంచులు కాపాడుతాయి. ఎప్పుడు ధర ఉంటే అప్పుడు అమ్ముకోవచ్చు. గిట్టుబాటు ధర అందుతుంది.
ఈ సంచులతో ప్రధాన లాభాలు
– సంచులలో నిల్వకు ఎటువంటి రసాయనాలు, పురుగు మందులు వాడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి పురుగు మందుల అవశేషాలు లేని విధంగా వివిధ ఉత్పత్తులు నిల్వ చేసుకోవచ్చు. సేంద్రియ నిల్వ పద్ధతి ఇది.
– మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు తక్కువ ధరకు అమ్మి నష్టపోకుండా, మంచి ధర వచ్చే వరకు నిల్వచేసుకుని, గిట్టుబాటు ధర పొందవచ్చు. ఇందుకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.
– విత్తనాలు ఉత్పత్తి చేసిన తర్వాత మరో పంటకు విత్తనం వాడాలంటే అవి పుచ్చిపోయి విత్తనంగా పనికిరావు. కానీ ఈ సంచులలో నిల్వ చేస్తే మొలకశాతం కోల్పోవు. పుచ్చులు రావు. విత్తనాల నాణ్యత బాగుంటుంది.
– బియ్యాన్ని కూడా నిల్వ చేసుకోవచ్చు. ఎర్ర పురుగు బియ్యానికి పట్టదు.
సంచులను ఎక్కడ నిల్వ చేయాలి?
మూడు పొరల సంచులలో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసి, ఆ సంచులను మనం నివసించే గదులలో లేదా ఎక్కడైనా సాధారణ పరిస్థితులు ఉన్న ఏ గదిలోనైనా ఉంచవచ్చు. ఈ సంచులు ఉంచడానికి ఎటువంటి ప్రత్యేకమైన కూలింగ్ గాని, శీతల గోడౌన్లు గానీ అవసరం ఉండవు. సంచులలో ఎటువంటి రసాయన పురుగు మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనం ఇంట్లోనే నిల్వ చేసుకోవచ్చు.
వెయ్యి నుంచి రెండు వేలు ఆదా
ఆదాయం పెంచడం, ఆహార రక్షణ, కలుషితంలేని ఆహారం, విత్తన నాణ్యత పెంపొందించడమే ధ్యేయంగా ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో రైతులు ఈ సంచులు వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీ వినియోగంపైన 60,000 గ్రామాల్లో రైతులకు శిక్షణ ఇవ్వబడింది. కోటికి పైగా సంచులు వాడుతున్నారు. ప్రతి క్వింటాలు ఉత్పత్తిని ఈ సంచుల్లో నిల్వ చేయడం వల్ల రూ. 1000-2000 ఆదా చేసుకున్నారు.