రాయపోల్ జూన్ 19: తక్కువ నీటితో రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సైతం డ్రిప్ ద్వారా పంటలు సాగుచేసి అధిక దిగుబడులు పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం చిన్నమాసాన్సల్లికి చెందిన రైతు సాకాల భిక్షపతి తనకున్న రెండు ఎకరాల్లో మూడు నెలల క్రితం బొప్పాయి (హైబ్రిడ్) సాగు చేశాడు.
బొప్పాయి సాగు చేస్తున్న క్రమంలో అంతర్ పంట సాగు చేయాలనే ఉద్దేశంతో నెలరోజుల క్రితం అంతర్ పంటగా టమాట సాగు చేశాడు. రెండు పంటలకూ డ్రిప్ ద్వారా అటు బొప్పా యి, ఇటు టమాట పంటలు సాగు చేస్తూ వచ్చాడు. టమాట పంట సాగుచేయడానికి రూ.35వేల పెట్టుబడిపెట్టా డు.డ్రిప్ ద్వారా నీటిని అందించి ఎట్టకేలకు అధిక పంట దిగుబడి సాధించాడు. కేవలం రెండు ఎకరాల్లో రెండు పంటలు దిగుబడి పొందుతున్న రైతు భిక్షపతిని పలువురు అభినందిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో టమాట కిలో రూ.50 ఉంది. రెండు రోజులకు ఒకసారి టమాటలు మార్కెట్కు తరలించగా రూ.50వేల వరకు ఆదాయం వస్తున్నట్లు రైతు పేర్కొంటున్నాడు.
బొప్పాయిలో అంతర్ పంటగా టమాట వేయగా పెట్టుబడులు పోనూ రూ. 3లక్షల ఆదాయం వచ్చిందని చెప్పాడు. వరికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం సూచించిన విధంగా మొదట్లో కేవలం బొప్పాయి పంట సాగుచేశానని, అంతర్ పంట వేయాలనే ఆలోచనతో టమాట పంట సాగు చేసినట్లు తెలిపాడు. తక్కువ నీటితో రెండు పంటలు సాగు చేయడంతో అధికంగా లాభాలు వచ్చాయని రైతు పేర్కొన్నాడు. మండలంలోని వివిధ గ్రామాల్లో అధిక శాతం మంది రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్నారు.
డ్రిప్ ద్వారా రెండు పంటలు సాగు చేస్తున్నా
డ్రిపు ద్వారా రెండు పంటలు సాగు చేస్తున్నా. బొప్పాయి సాగు చేయగా మధ్యలో ఖాళీగా ఉన్న భూమిలో ఇటీవల టమాట పంట సాగు చేశా.మార్కెట్లో మంచి ధర ఉన్నది. రూ. 35వేల పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు రూ.3 లక్షల లాభం పొందా. మారుతున్న కాలానికి అనుగుణంగా డ్రిప్ ద్వారా తక్కువ నీటితో అధిక లాభాలు పొందవచ్చు. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ సబ్సిడీలను వినియోగించుకొని రైతులు అర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. మూడు నెలల్లోనే అటు బొప్పాయి, ఇటు టమాట పంట సాగు చేశా.
-సాకాల భిక్షపతి, రైతు, చిన్నమాసాన్పల్లి