నమస్తే సార్! చలికాలం పంటగా ‘ఉల్లిగడ్డ’ సాగు చేయాలని అనుకుంటున్నా. ఈ కాలానికి అనువైన రకాలు, అనుకూల నేలల గురించి తెలియజేయగలరు. ఎస్. కుమార్.
ఉల్లిగడ్డలు చల్లని వాతావరణంలో పండే పంట అయినప్పటికీ, ఇవి ఎక్కువ మంచును తట్టుకోలేవు. మొక్కల పెరుగుదలకు 15 నుంచి 21 డిగ్రీల సెంటిగ్రేడ్, ఉల్లిగడ్డలు పెరగడానికి 20 నుంచి 25 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే.. ఉల్లిగడ్డల పెరుగుదల లోపిస్తుంది. నీరు నిలువని సారవంతమైన నేలల్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఉదజని సూచిక 6 – 7.5 మధ్య ఉండే నేలలు అనుకూలం. ఇక రకాల విషయానికి వస్తే.. బళ్లారి రెడ్, రాంపూర్ రెడ్, నాసిక్ రెడ్, పూసారెడ్, అర్క నికేతన్, అర్క కల్యాణ్, అర్క ప్రగతి, అర్క ఫౌండ్ లైట్ రెడ్, అగ్రి ఫౌండ్ డార్క్ రెడ్ రకాలను సాగుచేసుకోవచ్చు.
బళ్లారి రెడ్ : ఈ రకంలో పాయలు పెద్దగా.. ఒకటిగా కానీ, రెండుగా కానీ కలిసి ఉంటాయి. ఘాటు తక్కువ. అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేయడానికి అనుకూలం.
రాంపూర్ రెడ్ : ఇది కూడా బళ్లారి రెడ్ రకాన్నే పోలి ఉంటుంది. పెద్ద పాయలు, ఎక్కువ ఘాటు ఉంటుంది. అయితే, ఇవి సాగు చేస్తే దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
నాసిక్ రెడ్ : పాయలు మధ్యస్థంగా ఉంటాయి. ఎరుపు రంగులో, ఎక్కువ ఘాటుగా ఉంటాయి.
అర్క నికేతన్ : ఈ రకంలో పాయలు ఎరుపు రంగులో ఉంటాయి. ఒక్కో కాయ 100 గ్రా. నుంచి 180 గ్రా. వరకూ బరువు తూగుతాయి. ఘాటు ఎక్కువగా ఉండే ఈ ఉల్లిగడ్డలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు.
అర్క కల్యాణ్ : ఎక్కువ దిగుబడి కావాలంటే.. అర్క కల్యాణ్ రకాన్ని సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 13 నుంచి 14 టన్నులు వస్తాయి.
అర్క ప్రగతి : 120 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. పాయలు గుండ్రంగా, ఎరుపుగా ఉంటాయి. ఎకరానికి 13 టన్నులు దిగుబడి సాధించవచ్చు.
అర్క ఫౌండ్ లైట్రెడ్ : పాయలు చిన్నగా, గులాబీ రంగులో ఉంటాయి.
అగ్రి ఫౌండ్ డార్క్ రెడ్ : ఈ రకంలో పాయలు ముదురు ఎరుపు రంగులో.. గుండ్రంగా, ఘాటుగా ఉంటాయి. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.