Soybeans cultivation | సోయా చిక్కుడు.. పేరుకు ఇది పప్పు దినుసు పంట అయిన దీనిని నూనేల తయారికి ఎక్కువగా వినియోగిస్తున్నారు. మన దేశంలో మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. తెలంగాణలో ఖరిఫ్‌లో పండించే వర్షాధార పంటల్లో సోయచిక్కుడు ప్రధానమైనది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో దాదాపు 7.2 లక్షల ఎకరాల్లో సోయా పంట సాగుచేస్తూన్నారు. సోయా చిక్కుడులో 40 శాతం మాంస కృత్తులు, 25 శాతం నూనే కలిగి ఉండి.. దీనిని క్రమ పద్ధతిలో తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు.
రైతులు సోయాపంటను ఆశించే చీడపిడల గురించి అవగాహన ఏర్పరచుకుని సరైనా సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు పాందే అవకాశం ఉంటుంది. రైతులు చీడపీడలను సరైనా సమయంలో గుర్తించకపోవడం, చీడ పిడలను ఆలస్యంగా గుర్తించడం వలన తక్కువ దిగుబడి పొందుతున్నారు.
విత్తన రకాలు
సోయా చిక్కుడు సాగుకు మంచి దిగుబదినిచ్చే రకాలు, JS-335, ASB-22(బాస్కర్), LSB-18(బీమ్), PK-1029, JS-9305, JS-9560, LSB-18(బీమ్), JS-2069, JS-2029, VS-6124, మొదలైన రకాలను ఎంచుకొని మంచి దిగుబడులు సాదించవచ్చు.
నేలలు
సార వంతమైన నల్లరేగడి భూములు, బరువైన మద్యస్థ నేలలు సోయా చిక్కుడు సాగుకు అనుకూలమైనవి. నీటి వసతి ఉన్నట్లయితే ఎర్ర చెలక నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. రేగడి భూముల్లో కంటే కొంత దిగుబడి తక్కువగా ఉంటుంది.
విత్తన మోతాదు, విత్తనశుద్ధి
ఎకరం దుక్కిలో నాటుకోవడానికి 30-35 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని నాటుకోవడానికి 2 గంటల ముందు విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల భూమి నుంచి సోకే కొన్ని తెగుల్లను నివారించుకోవచ్చు. 1 కేజీ విత్తనానికి 2గ్రాముల కార్బండిజం-50 శాతంతో కాని లేదా కాప్టన్-70 శాతం 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత 25 కేజీల విత్తనానికి 500 గ్రాముల రైజోబియం కల్చర్‌ను విత్తనానికి పట్టుకునేలా నీటితో కలిపిన జిగురును రైజోబియం కల్చర్‌లో కలిపి విత్తనానికి పట్టించి నీడలో కొంతసేపు అరబెట్టుకొని గింజలను విత్తుకోవాలి.
సస్యరక్షణ
కాండం తొలిచే ఈగ : ఈగ లేత ఆకుల పై చిన్న గుంతలు చేసి గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి లార్వాలు బయటకు వచ్చి కాండంలోకి చేరి తినడం వలన కాండం వడలి పోతుంది. సరైన సమయంలో ఈగను గుర్తించలేకపొతే పంటను అధికంగా నష్టపరుస్తుంది. దీని నివారణకు అసిఫేట్ 1.0 గ్రా. లేదా క్లోరంధ్రానిప్రొల్ 0.3 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
రసం పిల్చే పురుగులు : మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు రసం పీల్చే పురుగులు ఆశించి మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. తామర పురుగు నివారణకు ఫిప్రొనిల్ 2 మి.లీ ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ధయోమిధాక్సామ్ 0.3 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పిండి పురుగు : ఇవి కొమ్మ, మొగ్గలు, కాండం రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు వాడి ఎండిపోతాయి. ఈ పురుగు నివారణకు 3 మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా 2 గ్రా. ఎసిఫెట్ తో పాటుగా 1 మి.లీ జిగురు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పొగాకు లద్దె పురుగు : ఈ పురుగు లార్వాలు ఆకుల్లోని పత్రహరితాన్ని గీకి తినడం వలన తొలుత ఆకులు తెల్లగా కనిపిస్తాయి. తర్వాత దశలో ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను జల్లేడగా మారుస్తాయి.
పేను బంక : పంట పూత దశలో ఉన్నప్పుడు పూతను లేత కాయలను ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు ఆసెటమిప్రిడ్ 20శాతం ఎస్పీ లీటర్ నీటికి 1 గ్రాముల చొప్పున లేదా ఎమ్డాక్లోప్రైడ్ 70 శాతం డబ్ల్యూజీ లీటర్ నీటికి 0.5 గ్రాముల చొప్పున కలుపుకుని పిచికారి చేయాలి.