Thotakura cultivation | ఆకుజాతికి చెందిన కూరల్లో తోటకూర ఎంతో ప్రసిద్ధి చెందినది. సంవత్సరం మొత్తం కూడా ఈ పంటను సాగు చేసుకునే వీలుంది. తోటకూరను ఎన్నో రకల కూరలలో కలుపుకొని వండుకుని తినొచ్చు. ముఖ్యంగా తోటకుర చిన్నపిల్లల్లో ఎదుగుదలకు బాగా ఉపయోగ పడుతుంది. ఈ ఆకులో ఉండే పోషకాలు గర్భంలోని శిశువు ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. తోటకురలో మనవ శరీరానికి అవసరమైన మాంసకృత్తులు, కాలిష్యం, లవణాలు, ఏ, సీ విటమిన్, ఇనుము వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. తోటకూరను విరివిగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. తరుచుగా తోటకూర తినడం వల్ల ఊబకాయం నుంచి కూడా బయటపడొచ్చు.
తోటకూర సాగులో సరైన యాజమాన్యం పద్ధతులు పాటించడం ద్వారా ఎకరాకు 3-5 టన్నుల వరకు దిగుబడి సాదించవచ్చు. వివిధ రకాల భూముల్లో సాగుకు అనువైన రకాలు-పూసచోటి, పూసబడిచౌల, పూసకీర్తి, పూసకిరణ్, పూసలాల్ చౌలై, ఆర్ఎన్ఏ-1, సిరికూర, ఆర్కసుగుణ, కో-1, కో-2, కో-3, కో-4, కో-5 మొదలైన రకాలను సాగు చేసుకుని అధిక దిగుబడులను సాధించవచ్చు.
విత్తనాలు, ఎరువులు
తోటకూరను దాదాపుగా అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. అయితే, నీరు నిలువ ఉండే నల్లరేగడి, చౌడు బూముల్లో సాగు చేయకూడదు. దుక్కిని 4-5 సార్లు దున్ని 2 మీటర్ల వెడల్ప్ తో 5మీటర్ల పొడవుతో మడులు చేసుకోవాలి.
ఎకరానికి ఆఖరు దుక్కిలో 20 కిలోల (20.20.0.13) 30 కిలోలు పోటాష్ నిచ్చే ఎరువులు వేసుకోవాలి. నేరుగా మడుల్లో చల్లుకోవడానికి ఎకరానికి కిలో విత్తనం సరిపోతుంది. విత్తనాలు చాల చిన్నవిగా ఉంటున్నందున కిలో విత్తనాన్ని 10 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. నారుపోసి నాటుకోవడానికి 500 గ్రాముల విత్తనం సరిపోతుంది. నారు పెంచుకొని మొక్కకు మొక్కకు 15 సెంటి మీటర్ల దూరంలో నాటుకోవాలి.
పురుగు మందులు, దిగుబడి
ఈ ఆకులను వంటల్లో వాడుతుంటారు. అందుకని వీలైనంత తక్కువ పురుగుమందులు వాడటం చాలా మంచిది. రసం పీల్చే పురుగులను నివారించడానికి పెప్రోనిల్ వంటి మందును తక్కువ మోతాదులో పిచికారి చేసుకోవాలి. ఆకులపై తుప్పు తెగులు కనిపిస్తే మ్యంకోజబ్ లీటర్ నీటికి 4 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారి చేయాలి. గొంగళి పురుగు బెడదను నివారించడానికి తక్కువ అవశేషాలు కలిగిన పురుగు మందు వేప నూనే కలిపి పిచికారి చేసుకోవాలి. మందులు పిచికారి చేసిన 5-6 రోజులకు కోతలు చేపట్టడం వలన మంచి దిగుబడిని సాధించవచ్చు.