Aswagandha | శ్రీ గంధం.. దీనినే అశ్వగంధ లేదా పెన్నేరు గడ్డలుగా పిలుస్తారు. నిటారుగా మీటరు ఎత్తు వరకు పెరుగుతుంది. వీటిని వ్యాపారపంగా తోటల్లో గానీ, ఇంటి పెరట్లోగానీ, డాబాపై కుండీల్లోగానీ పెంచుకోవచ్చు. జూలై రెండో వారం నుంచి ఆగష్టు రెండో వారం వరకు విత్తుకోవడానికి అనుకూల సమయం. పంట కాలం 150 రోజులు. రైతులకు మంచి ఆదాయాన్నిచ్చే ఔషధ పంటల్లో అశ్వగంధ ముఖ్యమైనది. అశ్వగంధ వేర్లు, కాండం, ఆకుల్లో ఔషధ గుణాలుంటాయి. అయితే వాణిజ్యపరంగా వేర్లకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి బాగా పండినప్పుడు పసుపు రంగులోకి మారుతాయి. దీని విత్తనాలు చిన్నవిగా లేత పసుపు రంగులో ఉంటాయి. వేర్లు దాదాపు 10-17 సెంమీ పొడవు, 0.5-1.5 సెంమీ వెడల్పు ఉంటాయి. వేర్లు లేత పసుపుతో కూడిన తెలుగు రంగులో ఉండి చేదును కలిగి ఉంటాయి. నరాల బలహీనతను నివారించడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, అల్సర్ల నివారణకు ఉపయోగిస్తారు. అశ్వగంధ వేర్ల చూర్ణం నిద్రలేమిని నివారిస్తుంది.
అనుకూల వాతావరణం
అశ్వగంధ మొక్కల సాగుకు 28-38 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. జీరో డిగ్రీ ఉష్ణోగ్రతలను ఈ పంట తట్టుకోదు. పొడి వాతావరణం అనుకూలం. కరువును తట్టుకుని నిలబడుతుంది. ఈ పంట సాగుకు సగటున దాదాపు 600-700 మిల్లీ మీటర్ల వర్షాపాతం అవసరమవుతుంది.
నేలలు
ఇసుక గరప నేలలు లేదా తేలికపాటి ఎర్ర నేలలు అనుకూలం. ఈ నేలల్లో సాగు చేసినపుడు వర్షాభావ పరిస్థితులలో తడులు అందించాలి. ఇసుకతో కూడిన నల్ల నేలల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. నీరు నిలువ ఉండే నేలలు ఆశ్వగంధ సేద్యానికి పనికిరావు. ఈ మొక్క వేర్ల అభివృద్ధికి శీతాకాలపు చివరి వానలు అనుకూలంగా ఉంటాయి.
విత్తన మోతాదు
ఎకరాకు 7 – 8 కిలోలు కనీసం 5 రెట్లు ఇసుకతో కలిపి వేదజల్లినట్లయితే విత్తనాలు ఒకే ప్రాంతంలో పడకుండా చూసుకోవచ్చు. ఎక్కువ లోతులో పడినట్లయితే మొలకెత్తే అవకాశం తక్కువగా ఉంటుంది. మొక్కకు మొక్కకు మధ్య 7 నుంచి 10 సెం.మీ. వరసకు వరసకు మధ్య 25 నుంచి 30 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ విస్తర్ణంలో సాగుచేసినప్పుడు విత్తనాన్ని నేరుగా వేదజల్లుకుంటే లాభదాయకంగా ఉంటుంది.
ఎరువులు
ఎకరాకు 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసుకోవాలి. అధిక దిగుబడి కోసం 20 కిలోల భాస్వరం, 16 కిలోల పోటాష్ ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఉదజని సూచిక 7.5–8.0 మధ్య ఉండేలా చూసుకోవాలి.
పంట సేకరణ
విత్తనం విత్తిన 150 – 180 రోజుల మధ్య పంట సిద్ధమవుతుంది. కాయలు ఎరువు రంగులోనికి మారినప్పుడు గానీ లేదా ఆకులు పూర్తిగా ఎండిపోయినప్పుడు గానీ అశ్వగంధ వేర్లను సేకరించాలి. మొక్కను సమూలంగా పీకి వేరు, కాండం వేరుచేయాలి. వేర్లను 7 నుంచి 10 సెం.మీ. ముక్కలుగా చేసుకుని నీడన ఆరబెట్టుకోవాలి.
అశ్వగంధ వేర్లు బాగా ఎండిన తర్వాత గ్రేడింగ్ చేసుకొని నిలువ చేసుకోవడం వలన అధిక ధర పొందవచ్చు. ఎకరాకు 250–300 కిలోల ఎండు వేర్లు, 80 కిలోల విత్తనం వస్తుంది. ఎకరాకు ఖర్చు రూ. 15 వేల వరకు ఉంటుంది. మార్కెట్ ధరను బట్టి రూ.35,000 – 45,000 వరకు నికరాదాయం పొందవచ్చు.