Alovera cultivation | కలబందగా పేరు గాంచిన ఈ మొక్క తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఆకులు మందంగా రసంతో అంచులందు ముళ్ళు కలిగి ఉంటాయి. ఇది ఎడారి ప్రాతాల్లో పెరిగే మొక్క. 30 నుంచి 60 సెం.మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. నవంబర్, ఫిబ్రవరి మాసాల మధ్య ఒక మీటరు ఎత్తు పెరిగే కాడపై ఎరుపు కలిసిన పసుపు పచ్చ వర్ణం గల పువ్వులు పూస్తాయి. అలోవెరా మొక్కల నుంచి వచ్చే పసుపు వర్ణ రసాన్ని ఎండబెట్టి ఔషధాలను తయారు చేస్తుంటారు.
కలబంద ఆకులను నేత్ర రోగాల నివారణ, అల్సర్ల నివారణ, చర్మ వ్యాధుల నివారణ, కాలేయ వ్యాధులు, కుష్టు వ్యాధి, మొలలు, మానసిక రుగ్మతుల నివారణలో వాడతారు. కలబంద జెల్‌ను చర్మ సౌందర్య క్రీముల తయారిలోనూ.. ప్లీహానికి సంబంధించిన వ్యాధులను నివారించడంలో, విరేచనకారిగాను, ఋతుక్రమాన్ని క్రమబద్దం చేయడంలోనూ వాడుతారు. వడదెబ్బ తగిలిన వారికి మంచి ప్రయోజనకారిగా పనిచేస్తుంది.
నేలలు
కలబంద పంటను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. అయితే, తేలికపాటి నేలలు అధిక ఫలితాల్ని ఇస్తుంది. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో కలబంద సాగు ఎక్కువగా చేపడుతుంటారు. దీనిని వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో పెంచవచ్చు. దీనికి తక్కువ వర్షపాతం, ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాల్లో కూడ పెంచవచ్చు.
పంటకాలం
కలబంద నాటిన తర్వాత 10 వ నెలలో మెదటి కోతకు వస్తుంది. తదుపరి 4 నెలలకు ఒకసారి ఆకులు సేకరించవచ్చు. ఈ పంట 5 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంటుంది.
విత్తన మోతాదు
కలబంద వేరు పిలక మొక్కల ద్వారా ప్రవర్థన్ చెందుతుంది. ఎకరాకు 8-10 వేల పిలకల వరకు నాటుకోవచ్చు. మొక్కల మధ్య దూరం 90 X 45 సెం.మీ. ఉండేలా చూసుకోవాలి.
ఎరువులు
ఎకరాకు 8-10 టన్నుల పశువుల పేడను ఎరువుగా వేయాలి. ప్రతి ఏటా ఎకరాకు అంతే మోతాదు ఎరువును అందివ్వాలి. ఇది కాకుండా 20:20:20 కి.గ్రా N:P:K ఎరువును అధిక ఉత్పత్తి కోసం వాడవచ్చు.
అంతర కృషి
కలబందను వర్షాధారంగా, నీటి పారుదల ద్వారా పెంచిన పంటలో అధిక దిగుబడి వస్తుంది. వేసని కాలంలో, వర్షాభావ పరిస్థితులలో నీటి సదుపాయం కల్పించడం ఆవసరం. కలబంద సాగులో క్రమం తప్పకుండా కలుపు మొక్కలు తీయాలి. మొక్కల చుట్టూ తవ్వడం, మొదళ్లలో మట్టి పోయడం చేస్తుండాలి.
సస్యరక్షణ
కలబంద పంటకు ఆశించు తీవ్రమైన తెగుళ్ళు ఏమీలేవు. అయితే ఇటీవలి కాలంలో ఆకు మచ్చ తెగులును గుర్తించారు.
పంట సేకరణ
కలబంద మొక్క తాజా ఆకులు 60 సెం.మీ. పొడవు 10 సెం.మీ. వెడల్పు, 1.5-2.0 సెం.మీ. మందం కలిగినవిగా ఉంటాయి. ఉదయం వేళలో కానీ, సాయంత్రం వేళలో కానీ ఆకులను సేకరించాలి. బాగా పెరిగన తర్వాత సంవత్సరంలో 3 సార్లు ముదిరిన ఆకులను సేకరించవచ్చు. కలబంద ఆకులే కాకుండా పీలికలను కూడా సేకరించవచ్చును.
దిగుబడి
కలబంద ఆకులు మొదటి ఏడాదిలో ఎకరాకు 25 వేల కిలోలు, రెండో ఏడాదిలో 30 వేల కిలోలు దిగుబడి వస్తుంది.