ప్రసుత్తం యాసంగి వరి నాట్లు కొనసాగుతున్నాయి. రైతులు కేజ్‌వీల్స్‌తో దమ్ము చేసే పనిలో బిజిబిజీగా ఉన్నారు. కేజ్‌వీల్స్‌తో పొలంలో దమ్ము చేసేటప్పుడు డ్రైవర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రతి సంవత్సరం వ్యవసాయ సీజన్లో ఇలాంటి ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. పొలం దున్నేందుకు వెళ్లిన డ్రైవర్ ఇంటికి వస్తాడన్న భరోసా లేకుండా పోతున్నది. రెక్కాడితే గానీ డొక్కాడని డ్రైవర్లు అనుకోకుండా ప్రమాదాల బారిన పడి ప్రాణాలు విడుస్తున్న సంఘటనలు చూస్తున్నాం.
– దస్తురాబాద్, జనవరి 16
కేజ్‌వీల్స్ ట్రాక్టర్లు బోల్తా పడి ఏటా అనేక మంది డ్రైవర్లు మృతి చెందుతున్నారు. సాగు లో యాంత్రీకరణ తప్పనిసరి కావడం, డ్రైవర్‌కు అవగాహన లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇందులో భాగంగా కొందరు గాయాలతో బయటపడుతుండగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. వరి సాగు చేసే రైతులు పొలాన్ని మెత్తగా దున్నడానికి కేజ్‌వీల్స్‌తో దమ్ము చేయిస్తుంటారు. ఈ సమయంలో అశ్రద్ధగా ఉంటే ప్రమాదాలు చో టు చేసుకుంటాయి. నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి తే డ్రైవర్లు ప్రమాదాల బారిన పడాల్సి వస్తుం ది. దీని వల్ల డ్రైవర్ల కుటుంబాలతో పాటు రై తులు కూడా ఆందోళనకు గురి కావస్తుంది. పొలం దమ్ము చేసే సమయంలో భూమిని అం చనా వేసుకుంటే సురక్షితంగా దుక్కిని పూర్తి చేయవచ్చు. కేజ్‌వీల్స్‌తో పొలం దున్నే సమయంలో ట్రాక్టర్ డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాల నుంచి బయట పడవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
అజాగ్రత్తగా కేజ్‌వీల్స్ నడిపి తల్లిదండ్రులు, భార్యాపిల్లలకు తీరని లోటు మిగిల్చవద్దు. ట్రాక్టర్ నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రతి డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలి. అనుభవం ఉంటేనే ట్రాక్టర్ నడపాలి. లైసెన్స్ లేకుండా ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత యాజమానులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మైనర్లు, లైసెన్స్ లేని వారికి డ్రైవింగ్ ఇవ్వదు. కంటి చూపు సరిగా లేని వారు డ్రైవింగ్ చేయరాదు. కేజ్‌వీల్స్‌ను రోడ్డుపై నడపరాదు. నడిపితే కఠిన చర్యలు తప్పవు. ప్రజల ఆస్తికి నష్టం కలిగిస్తే డ్రైవర్, యజమానిపై చర్యలు తీసుకోవడమే కాకుండా ట్రాక్టర్‌ను సీజ్ చేస్తాం.
– జ్యోతిమణి, ఎస్ఐ, దస్తురాబాద్