తాండూర్ : కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం పెద్దపీట వేస్తుందని గోలేటి ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి(Vijayabhaskar Reddy ) అన్నారు. తాండూర్ మండలం సింగరేణి ప్రాంతం మాదారంటౌన్ షిప్ మినీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన దసరా ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితులు అవధూత శర్మ ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించగా జీఎం దంపతులు పూజలో పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. బెల్లంపల్లి ఏరియాకు మళ్లీ మంచి రోజులు వచ్చి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. టౌన్షిప్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు సూరం రవీందర్ రెడ్డి, ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్ , అడ్హాక్ కమిటీ సభ్యులు ఓదేలు, రఘునాథ్ రెడ్డి, సంపత్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మల్లేష్ జీఎంకు స్వాగతం పలికారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మాదారం ఎస్సై సౌజన్య బందోబస్తు ఏర్పాటు చేశారు.