చెన్నూర్ రూరల్, జూలై 8: మంచిర్యా ల జిల్లా చెన్నూర్‌కు చెందిన కుడికాల మధుకర్ అనే వ్యక్తి ఒక మహిళతో సహజీవనం చేస్తూ..మరొకరిని పెళ్లి చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మంగళవారం మధూకర్ నివాసానికి వచ్చిన సౌమ్య అనే మహిళ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టింది. సౌమ్య తెలిపిన వివరాల ప్రకారం. 2016లో మధుకర్‌తో పరిచయం ప్రేమగా మారిందని, అప్పటి నుంచి సహజీవనం కొనసాగించామని సౌమ్య తెలిపింది.
మధ్యలో మధుకర్ తన బంధువుల కోరిక మేరకు మరో వివాహం చేసుకున్నాడని, అయినప్పటికీ తనను మళ్లీ సంప్రదించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం కొనసాగించాడు. 2022లో కరీంనగర్లో మధుకర్ తనను పెళ్లి చేసుకున్నట్లు సౌమ్య పేర్కొంది. మూడు సంవత్సరాల నుంచి నన్ను తన ఇంటికి తీసుకెళ్తాను అంటూ మాయమాటలు చెబుతూ వస్తున్నాడు. 15 రోజుల క్రితం నన్ను తన ఇంటికి తీసుకువస్తానని బట్టలు సదురుకో అని చెప్పాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఫోన్ నంబర్ బ్లాక్ చేసి ఇంటికి తీసుకెళ్లేందుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించాడని వాపోయింది.
ఈ క్రమంలో మధుకర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సౌమ్యను మధుకర్ కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చెన్నూర్ సీఐ దేవేందర్ రావు వివరణ కోరగా ఇరు వర్గాలతో సంప్రదించాం. రెండు రోజుల తర్వాత మళ్లీ పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించామని తెలిపారు.
నా భర్తపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-అనూష మధుకర్ భార్య
నా భర్తపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో కలిసిన ఫొటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కావాలనే మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై చెన్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు అనూష తెలిపారు.