మందమర్రి రూరల్, జూలై 22: మందమర్రి పట్టణంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో అధికారులు, పాలకులు తమకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపిస్తూ వెంటనే తమకు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన మహిళలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మొదటి విడుతలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు వచ్చినప్పటికీ తమకు ఇండ్లు ఇవ్వలేదని వాపోయారు. రెండవ విడుతలో ఇండ్లు మంజూరైనట్లు ఆన్లైన్లో చూపుతున్నప్పటికీ, అధికారులు ఇటీవల మళ్లీ ప్రకటించిన జాబితాలో తమ పేర్లు లేవని వాపోయారు.
ఈ విషయంపై అధికారులు, నాయకులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఈ నెల 18న డబుల్ బెడ్రూం ఇండ్ల తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకున్నామని గుర్తు చేశారు. అర్హులైన తమకు అధికారికంగా ఇండ్లను కేటాయించే వరకు ఆందోళన చేస్తామని తెలిపారు. అనర్హులకు, లంచాలు ఇచ్చిన వారికి ఇండ్లను కేటాయించారని, తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని వారు ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. ఈ ఆందోళనలో 19వ వార్డుకు చెందిన బొంగరాల రమ్య, గుర్రాల సంధ్య, మారపాక రాజేశ్వరి, కాదాసు మహేశ్వరి, హసీనాబేగం, లలిత, జూపాక సంధ్య, రాజేశ్వరి, గట్టమ్మ, సరిత పాల్గొన్నారు.