ఆర్ధికాభివృద్ధి సాధించడానికి ప్రవేశపెట్టిన స్త్రీనిధి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) అతివలు రుణాలు తీసుకొని వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. తీసుకోవ డంతోపాటు చెల్లింపులో కూడా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని మొండి బకాయిలను వసూలు చేస్తున్నారు. గ్రామ, మండల స్థాయిలో సంఘాల సభ్యులతో సమావేశమై చెల్లింపుల వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. ఫలితంగా రుణాల వసూళ్లలో మంచిర్యాల జిల్లా రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోనే మంచిర్యాల 4, నిర్మల్ 6వ స్థానంలో నిలువగా.. ఆసిఫాబాద్ 14, ఆదిలాబాద్ 30వ స్థానంలో ఉన్నాయి. ఎన్పీఏ(నాన్ పెర్ఫార్మింగ్ అసైట్) కూడా తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు.
మంచిర్యాల, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్త్రీ నిధి నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల్లో మన జిల్లాలు దూసుకుపోతున్నాయి. గతంలో ఇచ్చిన రుణాల్లో ఎన్పీఏ(నాన్ పెర్ఫార్మింగ్ అసైట్)శాతాన్ని గణనీయంగా తగ్గించడంలో మంచిర్యాల, నిర్మల్ జిల్లాలు సత్తా చాటాయి. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులతో అనుసంధానమై స్రీనిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నది. ఆ రుణం పొందిన మహిళ స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు వివిధ వ్యాపారాలకు ఆ మొత్తాన్ని వినియోగించుకొని, తిరిగి వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు చెల్లిస్తుంటారు. ఈ క్రమంలో వరుసగా మూడు నెలలు రుణాలు తిరిగి చెల్లించకుంటే అవి ఎన్పీఏ(నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ )గా మారిపోతాయి. అలాంటి రుణాలను సైతం వసూలు చేసి ఎన్‌పీఏను తగ్గించిన జిల్లాల జాబితాల్లో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే 4వ స్థానంలో, నిర్మల్ జిల్లా 6వ స్థానంలో నిలిచాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ 14, ఆదిలాబాద్ 30వ స్థానంలో ఉన్నాయి.
సాధారణంగా స్త్రీనిధి సంస్థ ఏటా రుణాలు ఇస్తూ ఎన్‌పీఏను తగ్గించుకుంటుంది. ఒక సభ్యురాలు రూ.10 వేల బకాయి ఉంటే రూ. లక్ష లోన్ ఇచ్చి అందులో రూ.10 వేలు రికవరీ చేసుకొని మిగిలిన మొత్తం ఆ సభ్యురాలికి చెల్లిస్తుంది. అలా ఎన్పీఏ తగ్గిస్తుంది. కానీ ఈ సారి మంచిర్యాల జిల్లా కొత్త లోన్లు ఇవ్వకుండానే పాత మొండి బకాయిలను వసూలు చేసింది. అందుకే గతేడాది ఎన్పీఏ 1.5 శాతం ఉంటే ఈ సారి 2.47 శాతంగా ఉంది. అదే రుణాలు ఇచ్చి ఉంటే రాష్ట్రంలోనే మంచిర్యాల నంబర్ వన్ స్థానంలో నిలిచేదని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో కొత్తగా రుణాలు ఇచ్చి ఎన్పీఏ క్లియర్ చేసినా రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా నాలుగో స్థానంలో నిలవడం రికార్డు అని చెబుతున్నారు. మంచిర్యాలలో అవుట్ స్టాండింగ్ ఎన్పీఏ రూ.4.77 కోట్లు ఉండగా, నిర్మల్‌లో రూ.6.26 కోట్లు, ఆదిలాబాద్‌లో రూ.8.17 కోట్లు ఉంది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో ఎన్పీఏ రూ.3.04 కోట్లు ఉన్నా వాటిని క్లియర్ చేయడంలో ఆ జిల్లా వెనుకబడి పోయింది.
ఎన్‌పీఏను తగ్గించడమే లక్ష్యంగా జిల్లాలో మొండి బకాయిల వసూలుకు ఆయా మండలాల వీవోలు, సీఏలతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఈ తొమ్మిది బృందాల సభ్యులు కోటపల్లి, చెన్నూర్, కన్నెపల్లి, భీమిని మండలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు రికవరీ చేస్తూ రాత్రి అక్కడే బస చేసి ఉదయాన్నే తిరిగి రికవరీ చేశారు. బకాయి ఉన్న సంఘ సభ్యులతో రాత్రి వేళల్లో సమావేశాలు నిర్వహిస్తూ రుణం చెల్లించడంతో కలిగే లాభాలు వివరిస్తూ బకాయిలను వసూలు చేశారు. గ్రామ, మండల స్థాయిలో మహిళా సంఘాలు సమావేశమై మూడు నెలల బకాయి పడ్డ వారిపై దృష్టి సారించారు. సత్ఫలితాలనివ్వడంతో ఎన్పీఏ తగ్గింది. – బీ శేషాద్రి, డీఆర్డీవో, మంచిర్యాల
మహిళలు డిజిటల్ పేమెంట్ చేయడం అలవర్చుకోవాలి. బకాయి ఉన్న వారంతా సకాలంలో పేమెంట్ చేసి పెంచి ఇస్తున్న రుణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్పీఏ తగ్గించడంలో డిజిటల్ పేమెంట్ చాలా ఉపయోగపడుతుంది. ఇందు కోసం ఫోన్ ఫే నుంచి Loan Repayment (లోన్ రీపేమెంట్)పై క్లిక్ చేసి STREE NIDHI – TELANGANA (స్త్రీ నిధి తెలంగాణ) అని టైప్ చేసి సెలెక్ట్ చేసుకొని మహిళా సంఘం ఐడీ (ఎస్‌హెచ్‌జీ ఐడీ) నమోదు చేసి, ఎంత డబ్బులు కట్టాలో ఆ మొత్తాన్ని నమోదు చేసి పేమెంట్ చేయవచ్చు. 2023-24లో ఎన్పీఏ తగ్గించడమే లక్ష్యంగా సంఘ సభ్యులు కృషి చేయాలి.
– వెంకట రమణ, స్త్రీ నిధి ఆర్ఎం, మంచిర్యాల