ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో సాగు పనులు జోరం దుకున్నాయి. జూన్ మాసంలో కొంత తగ్గుముఖం పట్టినా.. జూలైలో పది రోజులుగా ఏకధాటిగా వాన పడుతోంది. ఫలితంగా అన్నదాతలు సాగు పనుల్లో బిజీబిజీగా మారారు. పత్తి, సోయా, మక్క, కందులు, పెసర్లు, మినుము పంటలు వేయగా.. పక్షం రోజుల్లో నాట్లు కూడా పూర్తికానున్నాయి. రాష్ట్ర సర్కారు సాగుకు పూర్తిస్థాయిలో సహకరిస్తుండడంతో కర్షకులు ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం చెరువులు, ప్రాజెక్టుల కింద నాట్లు, కలుపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా.. ఈ సారి అంచనాలకు మించి వరి సాగయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
నిర్మల్, జూలై 26(నమస్తే తెలంగాణ) : సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో నిర్మల్ జిల్లాలో సాగు పనులు సంబురంగా సాగుతున్నాయి. వర్షాలు రికార్డుస్థాయిలో కురవడం, ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతుండడంతో సాగు పండుగలా సాగుతోంది. వానకాలం 4.10 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా, ఇప్పటికే 2.90 లక్షల ఎకరాల్లో వేశారు. 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని అంచనా వేశారు. ఇప్పటికే 613 చెరువుల్లోకి భారీగా నీరు చేరగా.. దాదాపు 500 చెరువులు నిండిపోయి మత్తడి దుంకుతున్నాయి. అలాగే గడ్డెన్న, స్వర్ణ, కడెం ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోగా, అదనంగా వచ్చిన నీటిని ఆయా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువనకు వదులుతున్నారు. చెరువులు, ప్రాజెక్టుల కింద ముమ్మరంగా వరినాట్లు వేస్తున్నారు. పొలాల్లో కూలీలు నాట్లు వేస్తూ, కలుపు తీస్తూ కనిపిస్తున్నారు. కాగా.. ఈసారి అంచనాలకు మించి వరి సాగయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే 2.90 లక్షల ఎకరాల్లో సాగు
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రైతులు 2.90 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వీటిలో అత్యధికంగా 1.45 లక్షల ఎకరాల్లో పత్తి, 1.10 లక్షల ఎకరాల్లో సోయా, 25 వేల ఎకరాల్లో మక్క, 10 వేల ఎకరాల్లో కందులు, పెసర్లు, మినుములు, ఇతర పంటలు వేశారు. మరో పక్షం రోజుల్లో నాట్లు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈనెల మొదటి వారం నుంచి పుష్కలంగా వర్షాలు కురుస్తుండడంతో సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 25 వరకు సాధారణ వర్షపాతం 422.3 మిల్లీ మీటర్లు ఉండగా, 35 శాతం అదనంగా అంటే 569.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అధిక వర్షాలతో చెరువులు, కుంటల్లోకి వరద చేరగా, చాలా చోట్ల చెరువులు అలుగు పారుతున్నాయి. 45 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని ముందుగానే అంచనా వేసి అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు అవసరమైన ఎరువులు పంపిణీ చేసి, మిగతా వాటిని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచారు.
70 శాతం సాగు పూర్తయింది..
గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 4.10 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా, ఇప్పటికే 70 శాతం పంటలు వేశారు. 2.90 లక్షల ఎకరాల్లో సాగు చేశాఒక్క వరి మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల నాట్లు మొదలయ్యాయి. వచ్చే ఆగస్టు 15 వరకు 100 శాతం సాగు పూర్తయ్యే అవకాశం ఉంది. పంటలకు అవసరమైన మేరకు ఎరువులను అందుబాటులో ఉంచాం. వచ్చే నెల 5వరకు రైతుబీమా కటాఫ్ తేదీగా పెట్టుకున్నాం. మరో వారం పది రోజుల్లో క్రాప్ బుకింగ్‌ను ప్రారంభిస్తాం.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి, నిర్మల్.