నెన్నెల,ఆగస్టు16 : కొనుగోలు చేసిన పట్టా భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారా.. లేదా అంటూ ఇద్దరు రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కేంద్రంలో శుక్రవారం జరిగింది. వివరాలిలా.. గొల్లపల్లిలో సర్వే నం 332 ,336/1/1,336/1/2,335/1లో దమ్మ సునీతకు కొంత భూమి ఉండగా, గొల్లపల్లికి చెందిన చింత విఘ్నేష్, విష్ణుకు విక్రయించారు. అట్టి భూమి పట్టా కోసం కొనుగోలు దారులు వారి కుటుంబ సభ్యుల పేరిట ధరణిలో స్లాట్ బుక్ చేసుకున్నారు. శుక్రవారం అమ్మకం దారులు, కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్లతో వచ్చారు. తహసీల్దార్ రమేశ్‌కు వాటిని అందజేయగా పరిశీలించి.. ఈ సర్వే నంబర్లపై ఇందూరి రాజేశ్వర్‌రావు ఫిర్యాదు చేశారని, విచారణ చేసిన తర్వాతే పట్టా చేస్తానని చెప్పారు. ఇందుకు విఘ్నేష్, విష్టు ఇప్పుడే పట్టా చేయాలని పట్టుబట్టారు. తహసీల్దార్‌తో గొడవకు దిగారు. పట్టా చేస్తారా లేదా అంటూ రైతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. మందు డబ్బా పట్టుకొని తాగుతామంటూ బెదిరించారు. విషయం తెలుసుకున్న నెన్నెల ఎస్ఐ స్రసాద్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని రైతులను సముదాయించారు. వారి వద్ద నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. అయిన వినకుండా విష్ణు మరో డబ్బా తీసుకొని వచ్చి తాగడానికి యత్నించారు. ఎస్ఐ మరోసారి వారిని అడ్డుకున్నారు. చివరకు తహసీల్దార్ రమేశ్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాల ప్రకారం విచారణ చేపట్టి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పారు. పోలీసులు రైతులను సముదాయించి ఇంటికి పంపించారు.
కెరమెరి, ఆగస్టు 16 : కెరమెరి మండల కేంద్రానికి చెందిన దరి రమేశ్ (30) అనే కూలీ శుక్రవారం పిడుగు పడి మృతి చెందాడు. కెరమెరి నుంచి చింతకర్ర గ్రామం వెళ్లే దారిలో షేక్ హుస్సేన్‌కు చేనులో పని చేస్తుండగా మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో పిడుగు పడింది. దీంతో రమేశ్ అకడికకడే మృతి చెందాడు. మృతుని భార్య దరి సుమిత్ర ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 16 : ఆసిఫాబాద్ మండలంలోని నందుప గ్రామానికి చెందిన ధౌత్రే అంజన్న (20) శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. తమ వ్యవసాయ భూమిలో పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో మార్గ మధ్యంలో పిడుగు పాటుకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అంజన్నను కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.