ఆదిలాబాద్ : కొత్తగా ఇంటి నిర్మాణం చేసేప్పుడు గర్భంతో ఉండవద్దన్న మూఢ నమ్మకంతో గర్భ విచ్ఛిత్తి మాత్రలు బలవంతంగా తినిపించటంతో గర్భిణి మృతి చెందిన ఘటన అదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బంగారిగూడలో నివాసముండే ప్రశాంత్ కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఆ సమయంలో అతని భార్య ప్రవళిక ఆరు నెలల గర్భవతి.
ఇల్లు కట్టుకునేప్పుడు ఇది శుభ పరిణామం కాదని ఎక్కడి నుంచో విచ్ఛిత్తి మాత్రలు తీసుకొచ్చి బలవంతంగా తినిపించాడు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి గాంధీ దవాఖానకు తరలించగా శనివారం సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.