బెల్లంపల్లి, జూలై 10 : బెల్లంపల్లి సింగరేణి ఏరియా దవాఖానలో ప్రత్యేక వైద్య నిపుణుల నియామకాల్లో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్నదని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరి యా ఉపాధ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీబీజీకేఎస్ నాయకులతో కలిసి శుక్రవారం ఆయన ఏరియా ద వాఖాన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ వారం వైద్య సేవలందించాల్సిన ప్రత్యేక వైద్య నిపుణులు కూడా ఇటీవల సరిగా విధులకు హాజరు కావడం లేదని ఆరోపించారు. గోదావరిఖని, రామకృష్ణాపూర్ ఏరియా దవాఖానల్లో నిర్వహించినట్లుగా బెల్లంపల్లి ఏరియా దవాఖానలో కూడా హైదరాబాద్‌కు చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పరిసర ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్ కార్మికులకు సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు ఎంతైనా అవసరముందని వివరించారు.
దవాఖానలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎక్స్‌రే ప్లాంట్ ఆపరేటర్ల కొరత ఉండడంతో కార్మిక కుటుంబాలకు వాటి సేవలు సరిగా అందడం లేదని మండిపడ్డారు. సింగరేణి సంస్థలో నోటిఫికేషన్ జారీ చేసి, వెంటనే అన్ని రకాల పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టాలని కోరారు. ఇటీవల దవాఖానలో లక్షలాది రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేయించినప్పటికీ, దశ మారలేదని ఆరోపించారు. 12వ వేజ్‌బోర్డు జూలై 1న ప్రారంభమైనప్పటికీ జేబీసీసీఐ కమిటీ వేయలేదని పేర్కొన్నారు. జాతీయ సంఘాలు కనీస ఉమ్మడి డిమాండ్ నోటీస్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటికైనా జేబీసీసీఐ కమిటీ ఏర్పాటు చేసి వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ నాయకులు అనుముల సత్యనారాయణ, ఏరియా కార్యదర్శి ఓరం కిరణ్, నాయకులు రవూఫ్, మారిన వెంకటేశ్, సంఘీ ప్రశాంత్, మర్రి సమ్మయ్య, రాజుభోగి శ్రీనివాస్ పాల్గొన్నారు.