ఆదిలాబాద్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిర్దేశిత గడువు లోగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి (CEO Sudarshan Reddy) అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను నిబంధనల మేరకు గుర్తించి తొలగించాలని సూచించారు.
బుధవారం ఆదిలాబాద్ ( Adilabad ) , నిర్మల్ జిల్లాలో సీఈవో పర్యటించారు. తాంసీ మండలం ఘోట్కూరి, భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి బూత్ స్థాయి అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, దరఖాస్తుల పరిశీలన తదితర ప్రక్రియలను తనిఖీ చేశారు. బీఎల్ఓల వద్ద ఉన్న దరఖాస్తులు, ఓటర్ల జాబితాలను పరిశీలించిన సీఈవో, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఓటర్ల పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే నిబంధనల ప్రకారం సరిచేయాలని సూచించారు. ఇంటింటి సర్వేలో ప్రతి కుటుంబంలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువీకరించిన సమాచారం ఆధారంగానే మార్పులు, చేర్పులు, తొలగింపులు చేపట్టాలని స్పష్టం చేశారు.
18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనర్హుల పేర్లు కొనసాగకుండా నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు.