మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 14: మన పూర్వీకులు వినాయక చవితికి మట్టితో తయారుచేసిన వినాయకుడిని పూజించేవారు. 21రకాల వనమూలికల ఆకులతో పూజించి ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇ చ్చేవారు. కానీ ప్రస్తుతం మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారి స్ (పీవోపీ)రసాయనంతో చేసిన విగ్రహాలను తయారుచేసి వాటిని పూజిస్తున్నారు. పర్యావరణానికి, జలవనరులకు పెను ప్రమాదంగా మారిన ఈ విగ్రహాలను కాకుండా మట్టితో తయారుచేసిన విగ్రహాలను పూజించాలని పర్యావరణ వేత్తలు, ప్రభు త్వం చెబుతున్నా ఆచరణలో సాధ్యపడడం లేదు.
అయినా కొందరు సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మట్టి వినాయక ప్రతిమలను తయారుచేయించి వాటిని పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 18న వినాయక చవితి సందర్భంగా మార్కెట్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయా రు చేసిన విగ్రహాలు అందుబాటులో ఉంచారు. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో వాడవాడలా వినాయక మండపాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు మొదలయ్యాయి. అయితే మట్టి వినాయకులనే పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలనేఉద్దేశంతో పర్యావరణ వేత్తలు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తమవంతు ప్రయత్నా లు చేస్తున్నారు. మట్టి విగ్రహాలతో పాటు ఆకులతో పూజలు చేయడంపై అవగాహన కల్పిస్తున్నారు.
విగ్రహ తయారీలో ప్రధానంగా వాడుతున్న రసాయన పదార్థం కాల్షియం సల్ఫేట్. దీనిని జిప్సం అని కూడా పిలుస్తారు. దీనిని వేడి చేస్తే వచ్చే పదార్థమే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇది నీటిలో సాధారణంగా కరగదు. ఒక అవక్షేపంలా ఏర్పడి నీటిని కలుషితం చేస్తుంది. పీవోపీ తయారీలో కెర్రిక్ ఆక్సైడ్, క్రోమియం ఆక్సైడ్, మొబైల్ టాక్సైడ్ వంటి రసాయనాలను ఎకువగా వాడుతారు. రసాయన పూతలు కలిగిన రంగులను అద్దుతారు. రసాయన పూరిత విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తే రసాయనాల ప్రభావంతో నీరు కలుషితమైపోయి అధిక గాఢత చెందుతాయి. విషతుల్యమైన నీరు తాగిన పలు జలచర జీవులు, కీటకాలు, క్రిములు, సరీసృపాలు, ఉభయ చర జీవులు, పక్షులు, చేపలు, నీటి మొకలు, మూగజీవాలు మృత్యువాత పడుతాయి. అదీ గాక విగ్రహ తయారీలో పనిచేసే కార్మికులపై కాలేయ సంబంధ వ్యాధుల ప్రభావం ఉంటుంది. రంగుల్లో వినియోగించే పాదరసం విషస్వభావం కలిగి ఉంటుంది. ఇది నీటిపైన పూతలాగా తేలియాడుతాయి. భూగర్భ జలాలపై ప్రభావం చూపుతాయి. ఒకసారిగా వందలాది విగ్రహాల నిమజ్జనం వలన నీటిలో ఆమ్లత్వంతో భార లోహాల సాంద్రత పెరిగి ఆక్సిజన్ నీటి ఆవరణ వ్యవస్థకు విఘాతం కలిగిస్తాయి.
వినాయక చవితి సందర్భంగా పూజలందుకున్న గణనాథుల విగ్రహాలను నిర్వాహకులు సమీపంలోని వాగులు, నదులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గణపతులను గోదావరిలో నిమజ్జనం చేస్తారు. గూడెం గోదావరితో పాటు మంచిర్యాల, ఇందారం, చెన్నూరు ప్రాంతాలతో పాటు గోదావరి తీరాన ఉన్న గ్రామాలనుంచి పెద్ద ఎత్తున విగ్రహాలను నదిలో నిమజ్జనం చేస్తారు. గోదావరి నది దూరంగా ఉన్న వారు వారికి సమీపంలోని చెరువుల్లో, వాగుల్లో నిమజ్జనం చేస్తారు. తాగునీటి అవసరాలకోసం గోదావరి నదితోపాటు గ్రామాలకు సమీపంలో ఉన్న చెరువులపైనే ప్రజలు ఆధారపడుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయక విగ్రహాలను వీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ఈ నీరంతా కలుషితమై పోతుంది. ఈ నీటిని తాగడం వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది.
జీవజాతుల మనుగడ కోసం మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలి. పీవోపీ విగ్రహాల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. జీవ వైవిధ్యానికి విఘాతం కలుగుతుంది. విగ్రహాల ఎత్తు, రంగులు భక్తికి కొలమానం కాదు. ప్రతి పౌరుడు తోటి వారికి మట్టి వినాయకుల పై అవగాహన కలిగించాలి. పర్యావరణ మిత్ర అలవాట్లు పెంపొందించుకోవాలి. గ్రామాలు, పట్టణాల్లో సమీపంలోని చెరువుల వద్దకు వెళ్లి బంకమట్టిని తీసుకువచ్చి గణనాథులను తయారుచేసుకోవాలి. చిన్నపాటి చిట్కాలతో మట్టి వినాయకుణ్ణి తయారుచేసుకోవచ్చు.
-గుండేటి యోగేశ్వర్, పర్యావరణవేత్త, మంచిర్యాల.