ఆసిఫాబాద్ టాన్, సెప్టెంబర్ 8 : పండుగలను మత సామరస్యంతో ప్రశాంత వాతావరణంలో సంతోషంగా నిర్వహించుకోవాలని ప్రజలకు కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. ఆదివారం ఆసిఫాబాద్ మండలంలో గొడెల్లివాగు వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, విద్యుత్ శాఖ ఏఈ. సదాశివ్, ఎస్ఐ రాజేశ్వర్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.
వినాయక నవరాత్రుల అనంతరం నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం ప్రాంతానికి వచ్చే వాహనాలు వచ్చేందుకు వీలుగా చెట్ల పొదలు తొలగించాలని, రోడ్లపై గుంతలను పూడ్చాలని నిమజ్జన ప్రాంతంలో క్రేన్ అందుబాటులో ఉంచాలని, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు.
వినాయక మండపాల వద్ద నిబంధనలను కచ్చితంగా పాటించాలని, సంబంధిత శాఖల సమన్వయంతో తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పారిశుధ్యం, విద్యుత్, మున్సిపల్, మండల ప్రజా పరిషత్ సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలిపారు. అనంతరం సమర్థ సాయి గణేశ్ మండలి వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి 11వ తేదీకి వాయిదా
ఆసిఫాబాద్ టాన్, సెప్టెంబర్ 8: రాష్ట్రస్థాయిలో మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజా భవన్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం 10వ తేదీ నుంచి 11వ తేదీకి వాయిదా వేసినట్లు కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అర్జీలను స్వీకరించేందుకు ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో 10వ తేదీన ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘంతో ముఖ్య సమావేశం ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని 10వ తేదీ నుంచి 11వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.