ముథోల్, జూన్ 18 : సోషల్ మీడియా వేదికగా రీల్స్, కామెడీ వీడియోలతో వేలాది మంది అభిమానులను బాసరకు చెందిన బాలుడు గుర్రప్ప వినయ్‌కుమార్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు వెండితెరపై మెరిసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు రూపొందించిన ‘సింగ్ గీతం’ చిత్రంలో నటించి టాలీవుడ్లో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రానికి చెందిన గుర్రప్ప రాజేశ్వర్-సరస్వతి దంపతుల కుమారుడు వినయ్‌కుమార్ చిన్నప్పటి నుంచే వినోదాత్మక వీడియోలు రూపొందిస్తూ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నాడు. తండ్రి ఫోన్లో ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ వేదికగా కామెడీ, సామాజిక సందేశాలతో కూడిన వీడియోలు పోస్ట్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సహజ నటన, హావభావాలతో ఆకట్టుకున్న వినయ్‌కు సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్లు ఏర్పడ్డారు. అదే గుర్తింపు అతనికి సినిమా అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
సింగ్ గీతంలో అవకాశం
సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన వినయ్‌కుమార్ సింగ్ గీతం చిత్రానికి నిర్వహించిన అడిషన్స్‌లో ఎంపికయ్యాడు. సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి తన పాత్రకు న్యాయం చేశాడని చిత్రబృందం ప్రశంసించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన ప్రస్తుతం బాసరలోని నాగభూషణ విద్యాలయంలో ఏడో తరగతి చదవుతున్నాడు. చదువుతోపాటు సోషల్ మీడియాలో సృజనాత్మక వీడియోలు రూపొందిస్తున్నాడు. సామాజిక అవగాహన కల్పించే అంశాలపై కూడా వీడియోలు చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు. భవిష్యత్‌లో మరిన్ని చిత్రాల్లో నటించి బాసరకు మంచి పేరు తీసుకురావాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు. ఇటీవల స్థానికులు వినయ్ కుమార్‌ను సన్మానించి అభినందనలు తెలిపారు.