కుభీర్ : ఉపాధ్యాయుల ( Teachers ) కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సాంగ్వి గ్రామస్థులు ( Sangvi ), విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి నిరసన ( Villagers Protest, ) తెలిపారు. 58 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు పిల్లలకు ఎలా బోధిస్తారని పేర్కొంటూ ఆందోళన నిర్వహించారు.
పాఠశాలలు పునః ప్రారంభమై రెండు నెలలు గడిచినా సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను నియమించడంలో ఆశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ లో నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి పిల్లలను ప్రైవేటుకు పంపొద్దని ఇక్కడే నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పి ఇప్పుడు టీచర్లు నియమించక పోగా పిల్లల భవిష్యత్తు తో ప్రభుత్వం, అధికారులు ఆటలాడు కుంటున్నారని ఆరోపించారు.
రేపటి లోగా టీచర్లను నియమించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. వెంటనే జిల్లా విద్యా శాఖ అధికారులు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.