నార్నూర్ : బాలల రక్షణ కోసమే గ్రామ, మండల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేశామని సీడీపీవో శారద (CDPO Sharada ) అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ,జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో గురువారం నార్నూర్ మండలంలో మండల స్థాయి బాలల పరిరక్షణ ( Child Protection ) కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఆమె హాజరయ్యారు.
వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు తప్పనిసరి అన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా, బాలలందరూ బడికి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత కమిటీపై ఉంటుందన్నారు. బాల కార్మికులు లేకుండా, బాలలపై ఎలాంటి వేధింపులు జరగకుండా చూడాలన్నారు. బాలికలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, ఇబ్బందులు పెట్టినా , బాల్య వివాహాలు జరుగుతున్నా 1098 టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
అనంతరం బాలల పరిరక్షణ కమిటీ కరదీపికను కమిటీ సభ్యులకు అందజేశారు. బాలల హక్కులను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్‌పీవో రమేష్, ఎంపీడీవో గంగా సింగ్, ఎంపీవో సాయి, రాజలింగు, మెడికల్ ఆఫీసర్ రాంబాబు , అంగన్వాడీకార్యకర్తలు, ఆశ కార్యకర్తలు మండల అధికారులు పాల్గొన్నారు.