బాసర, ఫిబ్రవరి 14 : బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం వసంత పంచమిని పురస్కరించుకుని భారీగా భక్తులు తరలివచ్చారు. వేకువ జామున మూడు గంటల నుంచే అమ్మవారి దర్శనంతోపాటు చిన్నారుల అక్షరాభ్యాసానికి బారులుదీరారు. తెలుగు రాష్ర్టాలతోపాటు మ హారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చారు. ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ ఆర్జేసీ జ్యోతి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్‌లు అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు అమ్మవారి ప్రతిమలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండ ముథోల్ సీఐ మల్లేశ్, బాసర ఎస్సై గణేశ్, మరో ఆరుగురు ఎస్సైలు, దాదాపు 400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతోపాటు బాసర గ్రామస్తులు, సేవా సమితి సభ్యులు చిన్నపిల్లలు, భక్తులకు తాగునీరు, పాలు, బిస్కెట్స్‌ను అందజేశారు.
వసంత పంచమి సందర్భంగా రికార్డు స్థాయిలో అక్షర శ్రీకారాలు జరిగాయి. రూ.1000 అక్షరాభ్యాసాలు 3735, రూ.150 అక్షరాభ్యాసాలు 3911 మొత్తం 7646 జరిగాయి. ఆర్జిత సేవలు, ప్రసాద విక్రయాల ద్వారా అమ్మవారికి రూ. 62 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో విజయరామారావు తెలిపారు.
అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు క్యూలైన్స్ మినహా ఏర్పాట్లు చేయలేదు. ఉదయం 3 గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభం కాగా.. దాదాపు రెండు గంటలు మాత్రమే క్యూలైన్లలో భక్తులకు పాలు, బిస్కెట్స్ అందజేశారు. భక్తుల రద్దీ పెరుగుతుండడంతో అధికారులు చేతులెత్తేశారు. దీంతో భక్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు ఆకలితో అలమటించి క్యూలైన్లలోనే ఏడ్చారు.
కొందరు భక్తులు క్యూలైన్ నుంచి బయటకు రాలేక అక్కడే కూర్చుండి పోయారు. దాదాపు దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పట్టింది. దేవస్థాన సిబ్బంది భక్తులకు సేవలు ఏర్పాటు చేయలేదు. ఈవో కార్యాలయంలో కూడా కనిపించలేదు. కొందరు అక్షరాభ్యాసం, దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. భక్తుల రద్దీని ముందే ఊహించినప్పటికీ ఏర్పాట్లు చేయకపోవడంతో బాసర గ్రామస్తులు ఎంపీ బాపురావు ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక గత ప్రభుత్వం యేటా వసంత పంచమికి దేవాదాయ శాఖ తరఫున అప్పటి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరై పట్టు వస్ర్తాలను సమర్పించేవారు. కానీ.. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ పట్టు వస్ర్తాలను సమర్పించడానికి రాకపోవడంతో భక్తులు, జిల్లా వాసులు నిరాశకు గురయ్యారు.