చెన్నూర్ రూరల్, సెప్టెంబర్ 25 : సుందరశాలలో గురువారం యూరియా పంపిణీ చేయగా, ముత్తరావుపల్లి, దుగ్నెపల్లి, చెల్లాయిపేట, నర్సక్కపేట గ్రామాల నుంచి సుమారు 800 మంది రైతులు తరలివచ్చి క్యూ కట్టారు. వర్షంలో తడుస్తూ క్యూ లైన్లో వేచి ఉన్నారు. సుందరశాలకు 266, అంగ్రాజ్పల్లికి 222 బస్తాలు అందుబాటులో ఉన్నాయి. రైతులకు సరిపడా యూరియా రాకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులను రైతులు నిలదీశారు. చెన్నూర్ సీఐ దేవేందర్, ఎస్ఐ సుబ్బారావు ఆధ్వర్యంలో యూరియా బస్తాలు పంపిణీ చేశారు. అటు అంగ్రాజ్పల్లి రైతు వేదికలో బావురావుపేట, అంగ్రాజ్పల్లి రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బానోత్ ప్రసాద్, ఏవో యామిని, ఏఈవోలు వనదేవి, అర్చన పాల్గొన్నారు.
రెబ్బెన, సెప్టెంబర్ 25 :రెబ్బెన మండల కేంద్రంలో గురువారం యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఉదయం రెబ్బెన పీఏసీఎస్ కార్యాలయానికి చేరుకొని యూరియా అందించాలని కోరారు. వర్షం పడుతుందని, గోదాం తెరిస్తే వర్షం నీరు లోపలికి వెళ్లి యూరియా బస్తాలు తడిసిపోతాయని రెబ్బెన వ్యవసాయశాఖ అధికారి దిలీప్ రైతులకు సూచించారు. వర్షం తగ్గిన తర్వాత యూరియా పంపిణీ చేస్తామని రైతులకు చెప్పగా, అనేక మంది రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొందరు మాత్రం యూరియా ఇవ్వాలని పట్టుబట్టి పీఏసీఎస్ కార్యాలయం ముందు గల అంతర్రాష్ట్ర రహదారిపైకి కి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఎస్ఐ వెంకటకృష్ణ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి పంపించారు.