కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అన్నదాతలు బహిరంగ దోపిడీకి గురవుతున్నారు. యూరియా కోసం రైతులు హాకా, పీఏసీఎస్, డీసీఎంఎస్, ఆగ్రోస్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కానీ.. వ్యాపారులు మాత్రం తమ దుకాణాల నుంచి అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా ఒక్కో యూరియా బస్తాకు రూ.1000 చొప్పున వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతూ తనిఖీలు నిర్వహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వానకాలంలో జిల్లాకు సుమారు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. ఇప్పటికే 90 శాతం చేరిందని అధికారులు చెబుతున్నారు. కానీ.. సబ్సిడీ కేంద్రాల వద్ద మాత్రం రైతుల క్యూలు తగ్గడం లేదు. దీంతో జిల్లాకు వచ్చిన యూరియా ఎటు వెళ్లిందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
హాకా సెంటర్ల ద్వారా రైతులకు అందాల్సిన సబ్బిడీ యూరియా పక్కదారి పట్టడం అంతా ఒక పథకం ప్రకారమే అన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో హాకా కేంద్రాలు ఉన్నట్లే రైతులకు తెలియకుండా మేనేజ్ చేసిన అధికారులు, వ్యాపారులు ఇప్పటికీ హాకా కేంద్రాలకు వచ్చిన సుమారు 1540 మెట్రిక్ టన్నుట యూరియా పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే సబ్సిడీ యూరియాను బ్లాక్ చేసి ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. అధికారులు మాత్రం ఈ దుకాణాలను తనిఖీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. తాజాగా సిర్పూర్(టీ) మండలంలోని ఒక ఫర్టిలైజర్ షాపుకి వచ్చిన లారీ లోడ్ యూరియాను రాత్రికి రాత్రే రైతులకు ఒక్కో బస్తాకు రూ.1000 చొప్పున విక్రయించారు.
ఈ విషయాన్ని రైతులు ఫోన్ చేసి చెబితే గాని వ్యవసాయ అధికారులకు తెలియలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కౌటాలకు వచ్చిన రెండు లారీల లోడ్ల యూరియా 90 శాతం బస్తాలు బ్లాక్‌లో అమ్మే వరకు వ్యవసాయ అధికారులకు తెలియదు. కాగా.. ఫర్టిలైజర్ దుకాణాలు నిర్వహించే వ్యాపారులే బినామీల పేరిట హాకా సెంటర్ల లైసెన్స్‌లు పొంది నిర్వహిస్తుండడంతో సబ్సిడీ యూరియా పెద్ద ఎత్తున పక్కదారి పట్టడానికి ఆస్కారం కల్పిస్తున్నది. వ్యవసాయ అధికారులతో ఫర్టిలైజర్ యజమానులకు ఉన్న సంబంధం కారణంగానే అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 18 ఆగ్రో సెంటర్లు, 25 డీసీఎంఎస్ సెంటర్లు, 12 పీఏసీఎస్‌లు, 12 హాకా కేంద్రాలు, 4 రైతు ఫార్మర్ సొసైటీలు ఉన్నాయి. ఈ కేంద్రాలకు 90 శాతం యూరియా కేటాయించగా.. వానకాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ రైతుల క్యూలు తగ్గడం లేదు. ఈ వానకాలంలో 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేసిన అధికారులు, అవసరాలకు తగ్గట్టుగా ఉంచడంలో విఫలమయ్యారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి (ఇన్చార్జి) శ్రీనివాస్‌రావుని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపీ ఉత్తర్వులు జారీ చేశారు. యూరియా పంపిణీని పర్యవేక్షించడంలో విఫలం కావడం, చట్టబద్ధమైన విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించడం, తమ పదవికి వ్యతిరేకంగా పనిచేయడంతో సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముందస్తు అనుమతిలేకుండా కార్యాలయాన్ని వదిలి వెళ్లకూడని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.