మంచిర్యాల, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్‌లో నియోజకవర్గ పరిధిలో నిజామాబాద్- జగ్దల్పూర్ జాతీయరహదారి-63పై రెండుచోట్ల టోల్గేట్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదమవుతున్నది. ఫారెస్టుశాఖ తన పరిధి దాటి నిబంధనలకు విరుద్ధంగా హరిత రుసుం వసూళ్లకు సిద్ధమవుతుండగా, స్థానికంగా అగ్గి రాజుకుంటున్నది. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అతిక్రమించడంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, ఈ వ్యవహారంపై ఎన్హెచ్ఏఐ అధికారులు సైతం స్పందించకపోవడం చర్చనీయాంశమవుతున్నది.
కోటపల్లి నుంచి పారుపల్లి, చెన్నూర్ మండలం కిష్టంపేటలో రెండు టోల్గేట్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతం ప్రాణహిత (కృష్ణజింకల) అభయారణ్యం పరిధిలోకి వస్తుందని.. అందుకే హరితరుసం వసూలు చేసేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇ చ్చారని చెబుతున్నారు. అటవీశాఖ వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ -1972 సెక్షన్ 28 (1)(డీ) అండ్ (2) ప్రకారం అనుమతులు వచ్చాయంటున్నారు. కానీ, ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యా క్ట్ను అతిక్రమిస్తూ, అటవీశాఖ తన పరిధి దాటి జాతీయ రహదారిపై రుసుం వసూళ్లకు తెరలేపుతున్నదని నిపుణులు ఆరోపిస్తున్నారు. చట్టంలో ఉన్నది ఒకటైతే అధికారులు చేసేది మరోలా ఉందంటూ మండిపడుతున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్-1972 సెక్షన్ 28 (1) (డీ) అండ్ (2) అనుసరించి చీఫ్ట్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌కు అభయారణ్యం ప్రాంతంలో హరిత రుసం వసూలు చేసే అధికారం ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ, ఒక్కసారి యాక్ట్‌లోని 28 సెక్షన్‌ను నిశితంగా పరిశీలిస్తే.. సెక్షన్ 28(1)ను అనుసరించి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌కు అభయారణ్యం లోపలికి ఎవరినైనా అనుమతించే అధికారం కల్పించబడింది. 28 (1) (ఏ) వన్యప్రాణుల పరిశోధన-అధ్యయనం, 28 (1) (బీ)ఫొటోగ్రఫీ, 28(1) (సీ) శాస్త్రీయ పరిశోధన, 28(1) (డీ) టూరిజం గురించి చెబుతున్నాయి.
ఇందులోనే సెక్షన్ 28 (2) అభయారణ్యంలోకి ఎవరైనా ప్రవేశించడానికి లేదా నివసించడానికి అనుమతించేందుకు రుసుం వసూలు చేసే అధికారాన్ని సైతం కల్పిస్తున్నది. దీని ప్రకారమే చెన్నూర్‌లోనూ హరితరుసం వసూలు చేస్తున్నామని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. యాక్ట్‌ను అనుసరించి అభయారణ్యం పరిధి లోపలి ప్రాంతాల్లోనే ఇలా రుసుం వసూలు చేసే అధికారం అటవీ శాఖ అధికారులకు ఉంది. కానీ ప్రస్తుతం పారుపల్లి, కిష్టంపేటలో ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన టోల్గేట్లు పూర్తిగా జాతీయ రహదారి-63 పరిధిలోకి వస్తాయి. ఈ నేషనల్ హైవే అనేది అభ్యయారణ్యం పరిధిలోకి రాదు. అంటే ఇక్కడ రుసుం వసూలు చేసే అధికారులు అటవీశాఖకు లేదని నిపుణులు అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఆర్అండ్బీ రహదారులపై టోల్గేట్లు పెట్టి, పన్ను వసూలు చేసే అధికారం పూర్తిగా ఆ ప్రభుత్వాలదే. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆ అధికారాన్ని అటవీశాఖకు ఇవ్వలేదు. అభయారణ్యంలో ఉన్న రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కలప అక్రమ రవాణా, అటవీ జంతువుల వేటను నివారించే అధికారమే అటవీశాఖకు ఉంటుంది.
కేవలం అభయారణ్యం లోపలే హరితరుసుం, డెవలప్మెంట్ చార్జీలు తీసుకోవచ్చు. కానీ నేషనల్ హైవేల్లో తీసుకోవాలని వైల్డ్‌లైఫ్ చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆర్టీసీ బస్సులు, గవర్నమెంట్ వెహికిల్స్, చెన్నూర్, కిష్టంపేట, కోటపల్లిలో నివసించే వారి స్థానిక వాహనాలకు ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) నిబంధనల ప్రకారం మినహాయింపు ఇస్తున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మరి అదే ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం ఏ జాతీయ రహదారిపైనా త్రీవీలర్ వాహనాలకు టోల్ వసూలు చేయరు.
మరి చెన్నూర్‌లోనే ఎందుకు చేస్తున్నట్లు.. అసలు త్రీవీలర్‌కు రూ.30, లైట్ మోటర్ వెహికిల్స్ (కార్లు, జీప్‌లు)లకు రూ.50, లారీలు, ట్రక్కులకు రూ.200 చొప్పున రుసుం ఎలా నిర్ణయించారు… ఏ చట్టంలో ఈ రుసుములను పేర్కొన్నారు. అసలు నేషనల్ హైవే మీద ఇలా రుసుం వసూలు చేసే అధికారం అటవీశాఖకు ఉందా.. అనే ప్రశ్నలకు అటు అటవీశాఖ నుంచి ఇటు ఎన్హెచ్ఏఐ నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. ఈ వ్యవహారశైలే చట్టవిరుద్ధంగా నిబంధనలు అతిక్రమించి ఎన్‌హెచ్-63పై హరితరుసుం వసూలుకు అధికారులు తెరలేపారనే వాదనలకు బలం చేకూరుస్తున్నది.
అటు ఎన్హెచ్ఏఐ, ఇటు అటవీశాఖ అధికారులు ఎవరికి వారు ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా జాతీయ రహదారులపై టోల్ వసూలు చేసే అధికారం అటవీశాఖకుగానీ, రాష్ట్రంలో ఇతర ప్రభు త్వ శాఖలకు ఉందా.. అని అటవీశాఖ ఉన్నతాధికారులకు హైదరాబాద్‌కు చెందిన ఓ ఆర్టీఐ ఆక్టివిస్ట్ సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరారు. దీనికి అటవీశాఖ ఉన్నతాధికారులు ఈ సమాచారం మా పరిధిలోకి రాదంటూ సమాధానం ఇచ్చారు.
మీకే స్పష్టత లేకుండా టోల్ గేట్ ఎలా ఏర్పాటు చేశారు. టోల్ ఎందుకు వసూలు చేస్తున్నారంటే వారి నుంచి సమాధానం లేదు. ఇక ఇదే విషయంపై ఎన్హెచ్ఏఐ అధికారులను వివరణ కోరితే.. సింపుల్ ఆ ఆర్టీఐ దరఖాస్తును అటవీశాఖకు ఫార్వర్డ్ చేసి చేతులు దులుపుకున్నారు.రెండు శాఖలు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో భాగంగానే అక్రమంగా టోల్ వసూళ్లకు తెరలేపారనే విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఈ వ్యవహారాన్ని ఎన్హెచ్ఏఐ అధికారులు సీరియస్‌గా తీసుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
ఎన్‌హెచ్-63 మీదుగా మహారాష్ట్ర, కాళేశ్వరం, మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్, హైదరాబాద్, మంథని ప్రాంతాల నుంచి రోజూ వేల సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి. దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. తక్కువలో తక్కువ రెండు వేల వాహనాలు ప్రతిరోజూ వస్తాయనుకుంటే, అందులో వెయ్యి వాహనాలు హెవీ వెహికిల్స్ అ నుకున్నా వాహనానికి రూ.200 చొప్పున రూ.రెండు ల క్షలు అవుతుంది.
ఇక కార్లు, ఆటోలు లెక్కలోకి తీసుకుం టే ఎంత కాదన్నా మరో లక్ష అవుతుంది. ఈ లెక్కన ఒక్క రోజు రూ.మూడు లక్షల వరకు వసూలు అవుతాయి. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఈ డబ్బులన్నీ నేరుగా వసూలు చేస్తారు. అంటే సంబంధిత టోల్గేట్లో ఉండే అధికారులు డబ్బులు తీసుకొని రిసీప్ట్ ఇస్తారు. అలా తీసుకున్న డబ్బుల్లో అధికారిక లెక్కల్లో చేరిది ఎంత.. అక్రమార్కుల చేబుల్లోకి పోయేది ఎంత అన్నది ఎవరూ తేల్చలేరు. అంటే తీసుకునే డబ్బులకు లెక్కా పత్రం ఉండదు.
దీన్ని అరికట్టాలంటే ఫాస్ట్‌ట్యాగ్ పెట్టాలి. అప్పుడు వసూలు చేసే డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. చెన్నూర్‌లో ఫాస్ట్‌ట్యాగ్ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నా.. గవర్నమెంట్ ఆర్డర్ లేదా జీవో ఉంటేనే బ్యాంక్‌లు ఫాస్ట్ ట్యాగ్ ఇస్తాయని తెలుస్తున్నది. ఈ లెక్కన ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ పెట్టే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. ఈ విషయమై అటవీశాఖ అధికారులు ఓ బ్యాంక్‌ను సంప్రదించగా… గవర్నమెంట్ ఆర్డర్ ఉంటేనే ఇస్తామని, సున్నితంగా నిరాకరించినట్లు అటవీశాఖలో పనిచేసే ఓ ఉద్యోగి తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు తెలిసింది.
వైల్డ్‌లైఫ్ యాక్ట్-1972 సెక్షన్ 28 ప్రకారం జాతీయ రహదారిపై టోల్గేట్ ఏర్పాటు చేసే అధికారం ఫారెస్ట్ అధికారులకు లేదు. ఆ అధికారం కేవలం ఎన్హెచ్ఏఐకే ఉంటుంది. ఇలా చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. కానీ తెలంగాణ ఫారెస్ట్ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా నేషనల్ హైవేపై సైతం ఇలానే టోల్గేట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది కూడా పూర్తిగా చట్ట విరుద్ధం. ఈ రెండు విషయాలపై మేం పోరాడుతున్నాం. ఎన్హెచ్ఏఐ దృష్టికి తీసుకెళ్లాం. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో అప్పీల్‌కి వెళ్లాం. చట్ట పరిధిని దాటి ఇలా రుసుం వసూళ్లు చేయడం సరికాదు. దీనికి బాధ్యులైన అధికారులు చర్యలు తీసుకోవాలి.
– జీవీ వంశీకృష్ణ, ఆర్డీఐ యాక్టివిస్ట్