ఎదులాపురం, మార్చి 3 : మూత్రపిండాల్లో సాధారణంగా పది మిల్లీమీటర్ల పరిమాణంలోపు రాళ్లు ఏర్పడుతుంటాయి.. కానీ, ఓ బాలుడి మూత్రపిండంలో ఏకంగా 200 గ్రాముల(6 సెంటీ మీటర్ల) రాయి ఉండగా దానిని వైద్యులు తొలగించారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పాలవాగుకు చెందిన బాలుడు కొట్నక్ లింగు రిమ్మ ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. గతంలో పలుమార్లు కిడ్నీలో నొప్పి రావడంతో స్థానిక వైద్యుల వద్ద నొప్పి నివారణ మాత్రలు వేసుకున్నాడు.
మూడు రోజుల క్రితం పాఠశాలలో ఉన్నప్పుడు నొప్పి ఎకువకావడంతో ఏఎన్ఎం రిమ్స్‌కు తీసుకొచ్చారు. పరీక్షించిన అనుబంధ సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఎడమ మూత్రపిండంలో దాదాపు 200 గ్రాముల రాయి ఉన్నట్లు గుర్తించారు. యూరాలజీ వైద్యుడు కె.కార్తీక్ కుమార్ శస్త్రచికిత్స చేసి తొలగించినట్లు సోమవారం తెలిపారు. మూత్రపిండంలో దాదాపు మూడేళ్లుగా ఆ రాయి ఉండి ఉంటుందని, చిన్న పరిమాణం నుంచి అలా పెరుగుతూ వచ్చిందన్నారు.