ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జూన్ 9 : బాబాపూర్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి తర్వాత షార్ట్ సర్యూట్‌తో రెండిళ్లు దగ్ధమయ్యాయి. అందరూ గాఢ నిద్రలో ఉండగా, షార్ట్ సర్క్యూట్ కావడంతో కవాలర్ లక్ష్మి, సురేశ్ ఇళ్లలో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్పటికే ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, బంగారం, నగదు పూర్తిగా కాలిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఆర్ఐ సాయిప్రసాద్ నిర్వహించిన పంచనామా ప్రకారం లక్ష్మికి చెందిన 4 తులాల బంగారం, రూ. 4.20 లక్షలు, 5 క్వింటాళ్ల బియ్యం, నిత్యావసర సరుకులు కాలిపోగా, సురేశ్‌కు చెందిన 70 బస్తాల యూరియా, 40 బస్తాల డీఏపీ, రూ. 42 వేలు, వరి గడ్డి పూర్తిగా కాలిపోయాయి.
బాబాపూర్ గ్రామానికి చెందిన కవాల్కర్ లక్ష్మి ఇల్లు దగ్ధం కావడంతో అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం నాయకులు విరాళాల ద్వారా సేకరించిన రూ. 10,768తో పాటు 50 కేజీల బియ్యం, 5 లీటర్ల వంట నూనె, సామగ్రి, వంట పాత్రలు అందించి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం యువజన అధ్యక్షుడు హివ్రే సందీప్, సెండే మురళీకృష్ణ, ఆనంద్‌రావు, ఉద్ధవ్, తపసే పోచన్న, మేంగ్రే మారుతి, కవలార్ రవీందర్, ఆకాశ్, బిజ్జు ఉన్నారు.