కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం అటవీ ప్రాంతాల్లో పెద్దపులి ( Tiger attack) సంచరిస్తూ అలజడి సృష్టిస్తుంది. బెల్లంపల్లి రేంజ్ పరిధిలోని బుగ్గగూడెం శివారు ప్రాంతంతో పాటు దేవాపూర్ రేంజ్ పరిధిలోని ఎగ్గండి శివారులో వేర్వేరుగా పశువుల ( Cattle) పై దాడి చేసి హతమార్చింది.
బుగ్గగూడెం, కర్షలగట్టం అటవీ ప్రాంతానికి సమీపంలోని రాళ్లవాగు పక్కన ఉన్న పత్తి చేనులోని ఆవుపై పులి దాడి చేసి చంపివేసింది. ఈ ఆవు బుగ్గగూడెం గ్రామానికి చెందిన పల్లె ఎల్లక్కగా ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. దేవాపూర్ రేంజ్ పరిధిలోని ఎగ్గండి ప్రాంతంలో సైతం మరో ఆవుపై దాడి చేసి హత మార్చింది.
ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో పశువులపై పెద్దపులి దాడి ఘటనలు అధికంగా చోటు చేసుకున్నాయి. సమీప గ్రామాల ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు కోరారు. పులి సంచారంతో అటవీ శివారు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.