మంచిర్యాల, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి ము న్సిపాలిటీలో పరిధిలోని సర్వే నంబర్-45లోగల ఒర్రెను పూడ్చేసి, రెండెకరాల దాకా కబ్జా చేసినా యంత్రాంగం ‘మూమూలు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. క్యాతన్‌పల్లి చెరువు అలుగు పారినప్పుడు ఈ కాలువ(ఒర్రె) ద్వారా ప్రవాహం వచ్చి రాళ్లవాగులో క లుస్తుంది. దాదాపు నాలుగైదు కిలోమీటర్ల మేర 100 మీటర్ల వెడల్పుతో పారే ఈ ఒర్రెను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేశా రు. ఒర్రెను మింగేయడమేగాక 10 మీటర్ల వెడల్పుతో సొంతంగా కాలువ తవ్వి, ఆ కాలువకు ఇరువైపులా గోడలు సైతం కట్టుకుంటూ పోతున్నారు. ఇప్పటికే రెండు కిలోమీటర్ల మేర కాలువకు ఇరువైపులా గోడల నిర్మాణం చేపట్టారు. 100 మీటర్లుగా పైగా విస్తీర్ణమున్న ఈ ఒర్రె, ఈ నిర్మాణాల తర్వాత 10 మీటర్లే ఉండ డం గమనార్హం. కాలువ లోపల గోడలంటూ నిర్మిస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేక మున్సిపల్‌శాఖ లేక రెవెన్యూ శాఖ నిర్మించాలి. కానీ ఇక్క డ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేట్ వ్యక్తులు ఒర్రె లోపల గోడలు కట్టుకుంటూ పోతున్నారు. ఒర్రెను ఆక్రమించి కొన్ని రోజులుగా ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
గతంలోనూ ఈ ఒర్రె భూమిని కొంత కబ్జా చేసిన అక్రమార్కులు ప్లాటింగ్ చేసి మరీ అమ్మేసినట్లు తెలుస్తున్నది. ఇప్పుడు ఒర్రెలో ఓ పక్కన నిర్మాణాలు సాగుతుండగా, కొన్ని రోజుల ముందే మరో పక్కా ఇదే తరహా నిర్మాణాలు చేశారు. దాదాపు ఐదారు ఎకరాలు ప్లాటింగ్ చేసి మరీ అమ్మేశారు. ఇప్పుడు ఆక్రమించిన భూమిని సైతం ప్లాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో అన్ని శాఖల అధికారులకు డబ్బులు ఇచ్చి, దర్జాగా కబ్జా చేసి ప్లాటింగ్ చేసి అమ్మేశారని, అప్పుడు కాలువ పక్కన బఫర్ జోన్ లేకుండానే ప్లాటింగ్ చేశారని స్థానికులు చెబుతున్నారు. భారీ ప్రవాహంతో వచ్చే ఒర్రెకు బఫర్‌జోన్ ఉందని, అది కూడా వదిలేయకుండా అక్రమార్కులు ఇష్టారాజ్యం చేస్తున్నారని పక్కన వ్యవసాయ భూములున్న రైతులు వాపోతున్నారు. పెద్ద ఒర్రెను చిన్న మురుగు కాలువగా మార్చి గోడలు కడుతుంటే ఇటువైపు వచ్చి చూసిన నాథుడే లేడంటూ పోయాడాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు లంచాలు ఇవ్వకుండా ఇది ఎలా సాధ్యమవుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమాలు తొలగించి కాలువను పునరుద్ధరించుకుంటే తమ భూముల్లోకి నీరు చేరి మునిగిపోయే ప్రమా దం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఒర్రె కబ్జాకు గురైంది. పోనీ సొంత భూమిలోనైనా ప్లాటింగ్ చేస్తున్నారేమో అనుకుంటే అదీ లేదు. సర్వే నంబర్ 45లో వారసులకు మధ్య గొడవలు నడుస్తున్నాయి. ఈ భూమిని కొనకూడదు, అమ్మకూడదని కోర్టు 2013లోనే ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కానీ దానిని పక్కనపెట్టి వారుసుల్లో ఒక్కరు మిగిలిన వారిని బెదిరింపులకు గురిచేసి మరీ ఒర్రెను ఆక్రమించుకొని మరీ ప్లాటింగ్ చేసి అమ్మేస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా, ఇక్కడ కొస మెరుపు ఏమిటం టే కోర్టు కేసు ఉన్న భూమిలో ప్లాటింగ్ చేసేందుకు దరఖాస్తు చేసుకోగా, రెవెన్యూ అధికారు లు వచ్చి సర్వే చేసి వెళ్లినట్లు తెలుస్తున్నది. గ తంలో ప్లాటింగ్ చేసి అమ్మేసిన భూమి సైతం కోర్టు కేసుల్లో ఉండగానే అమ్మేశారనే ఆరోపణలున్నాయి. మరీ ఇంతగా కోర్టు ఆదేశాలను ధి క్కరించి మరీ అక్రమార్కులకు అధికారులు ఎందుకు సహకరిస్తున్నారనేది తెలియడం లే దు. ఈ మధ్య వారసుల్లో ఒక్కరైన వ్యక్తి న్యా యం కోసం వెళ్తే కోర్టు ఆదేశాల మేరకు ఆ భూ మిలోకి ఎవరూ రాకుండా పరిరక్షించాల్సిన అ ధికారులే.. సదరు వ్యక్తిని బెదిరించినట్లు సమాచారం. విషయం పెద్దది కాకుండా కాంప్రమైజ్ చేసుకోవాలంటూ పోలీసులు ఒత్తిడి తీసుకురాగా, సదరు బాధితుడు న్యాయం కోసం కలెక్టర్, సీపీ, డీసీపీ, ఎంఆర్వో, మున్సిపల్, ఇరిగేషన్ ఇలా అన్ని శాఖల్లో ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరి ఆయన వెళ్లి ఫిర్యాదు చేశాకైనా కదలాల్సిన యంత్రాంగం ఇప్పటి వరకు కనీసం అక్కడికి వెళ్లి పరిశీలించిన దాఖలాలు లేవు.
ఒర్రెను కబ్జా చేసి రెండెకరాలు ఆక్రమించి ప్లాటింగ్ చేస్తున్న విషయంపై మందమర్రి ఇరిగేషన్ శాఖ డీఈ శారదను వివరణ కోరగా ఇది ఇరిగేషన్ పరిధిలోకి రాదన్నారు. మున్సిపల్ పరిధిలోకి వస్తుందని మీరు వెళ్లి వారినే కలవండని చెప్పారు. ఇదే విషయంపై క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ కమిషనర్ మురళీకష్ణను వివరణ కోరగా చెరువుకు సంబంధించిన ఒర్రె ఇరిగేషన్ వాళ్లది కాకుండా మాది ఎలా అవుతుందన్నారు. ఆ ఫొటోలు పంపండి చూస్తా అని చెప్పిన ఆయన, ఫొటోలు వాట్సప్ చేశాక చూసి మా టౌన్ ప్లానింగ్ అధికారికి పంపించామని.. విచారణ చేస్తామని చెప్పారు. ఇలా అధికారులు ఎవరికి వారు మాది కాదంటే.. మాది కాదంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. మరి ఇప్పటికైనా ఈ వ్యవహారాన్ని అటు ఇరిగేషన్, ఇటు మున్సిపల్ శాఖలు సీరియస్‌గా తీసుకోకపోతే కబ్జాకు గురైన కాలువతో చుట్టు పక్కల ప్రాంతాల వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తారా.. లేకపోతే అక్రమార్కులకే కొమ్ము కాస్తారా అనేది తేలాల్సి ఉంది.