నిర్మల్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీల్లో అక్రమ నిర్మాణాలకు ఇక కాలం చెల్లనున్నది. ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతులను జారీ చేసేందుకు అమలు చేస్తున్న టీఎస్ బీపాస్‌కు రెండేండ్లు పూర్తయ్యింది. కాగా, ఈ విధానాన్ని గ్రామ పంచాయతీల్లోనూ తీసుకొస్తున్నది. అనధికారిక లే అవుట్లు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం అమలు చేస్తున్న డీటీసీపీవో, ఈ-పంచాయతీ విధానాన్ని టీఎస్ బీపాస్‌తో అనుసంధానం చేయనున్నది. భవన నిర్మాణాల అనుమతులను ఇకపై ఈ విధానంలోనే ఇవ్వనున్నది. అందుకు జీవో నంబర్ 52ను ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటి వరకు గ్రామపంచాయతీల్లో భవన నిర్మాణాలకు సంబంధించి పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే సర్పంచ్, కార్యదర్శి సదరు దరఖాస్తును పరిశీలించి, ఈ-పంచాయతీ ద్వారా అనుమతులిస్తూ వస్తున్నారు. ఇకపై గ్రామపంచాయతీల్లో భవన నిర్మాణాలతో పాటు, లే అవుట్ల అనుమతులను టీఎస్ బీపాస్ ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది.
పకడ్బందీగా పన్నుల వసూలు..
గ్రామ పంచాయతీల్లో ఎక్కువగా గ్రామకంఠం ఆధారంగా, వారసత్వంగా వచ్చిన స్థలాల్లో నిర్మాణాలు చేసుకుంటారు. సంబంధిత నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్య తలెత్తే అవకాశముంది. అయితే టీఎస్ బీపాస్ అమలుకు సంబంధించి పూర్తి గైడ్‌లైన్స్ రావాల్సి ఉన్నది. మరోవైపు టీఎస్ బీపాస్ విధానాన్ని గ్రామపంచాయతీల్లోనూ అమల్లోకి తీసుకురావడం ద్వారా నిర్మాణాల వివరాలతో పాటు పన్నుల వసూలు కూడా పకడ్బందీగా జరిగి, పంచాయతీల ఆదాయం పెరుగనున్నది. పల్లెల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు పంచాయతీ అధికారులకు, సిబ్బందికి త్వరలోనే శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. శిక్షణ పూర్తయితే టీఎస్ బీపాస్‌పై అధికారులకు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బ్యాంక్ ఖాతాలు తెరిచే ప్రక్రియ పూర్తి..
ప్రభుత్వ ఆదేశాలతో ఈ విధానాన్ని అమలు చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఒక వైపు డీటీసీపీవో, ఈ-పంచాయతీ విధానాన్ని టీఎస్-బీపాస్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. మిగతా ప్రక్రియను జిల్లా పంచాయతీ అధికారులు వేగవంతం చేశారు. త్వరలోనే అమల్లోకి రానున్నందున ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాలను తెరిచే ప్రక్రియ కూడా పూర్తయింది. నిర్మల్ జిల్లాలోని 396 గ్రామపంచాయతీలకు ప్రత్యేకంగా అకౌంట్ ఓపెన్ చేశారు. టీఎస్-బీపాస్ ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే అందుకు సంబంధించిన చలాన్ డబ్బులు నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. మీ సేవా కేంద్రాల ద్వారా అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు, ఇంటి ప్లాన్‌ను పొందుపర్చి టీఎస్-బీపాస్‌లో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం 21 రోజుల్లో అనుమతి లభిస్తుంది.
గైడ్‌లైన్స్ రాగానే అమలు చేస్తాం..
గ్రామాల్లో కూడా పట్టణాల మాదిరిగానే భవన నిర్మాణ, లే అవుట్ అనుమతుల కోసం టీఎస్ బీపాస్‌ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేశాం. ఇకపై అన్ని అనుమతులు ఆన్లైన్ ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి పూర్తి గైడ్‌లైన్స్ రావాల్సి ఉంది. విధివిధానాలు ఖరారు కాగానే జిల్లాల్లోని గ్రామాల్లో కూడా టీఎస్ బీ పాస్‌ను అమలు చేస్తాం. – శ్రీలత, డీపీవో, నిర్మల్ జిల్లా