హర్కాపూర్ అంద్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ(బీ) గ్రామానికి చెందిన ఆదివాసులు బిందెడు నీటి కోసం ఎడ్లబండ్లలో రెండు కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. మామిడిగూడ(బీ)లో 17 ఉమ్మడి కుటుంబాలు ఉండగా.. 250కి పైగా జనాభా ఉంటుంది. గ్రామంలోని బోర్లు, చేతిపంపులు అడుగంటి పోవడం, మిషన్ భగీరథ పథకం పని చేయక పోవడంతో వారం రోజులుగా తాగునీటి కోసం ఆదివాసులు అవస్థలు పడుతున్నారు.
ప్రతి ఇంటికి ఎడ్లబండ్లపై నీటి ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. పిట్టబోంగురం గ్రామానికి చెందిన ఉయిక బండుకు చెందిన వ్యవసాయ బావి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి రెండు కిలోమీటర్లు నడిచి మరీ నీళ్లు తెచ్చుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. తాగునీటి కష్టాలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి ఎద్దడితో పెళ్లి వేడుకలు నిర్వహించాలంటే భయంగా ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తాగునీటి కష్టాలను పరిష్కరించి ఆదుకోవాలని కోరుతున్నారు.
– ఇంద్రవెల్లి, ఏప్రిల్ 5
తాగునీటి సమస్యను అధికారులు పరిష్కరించాలి. బిందెడు నీళ్ల కోసం రెండు కిలోమిటర్ల దూరం వెళ్లాల్సి వస్తున్నది. నీటి సమస్యతో పెళ్లి వేడుకలు నిర్వహించాలంటే భయపడుతున్నాం. ఆదివాసులపై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. గ్రామానికి చెందిన చేతి పంపులు అడుగంటిపోనయ్.
– వెట్టి రేణుకాబాయి, మామిడిగూడ(బీ) గ్రామస్తురాలు
గ్రామంలోని అన్ని బోర్లు, చేతిపంపులు అడుగంటి పోయాయి. గ్రామంలో నీళ్లు లేకపోవడంతో పిట్టబోంగురం గ్రామానికి చెందిన ఉయిక బండ్డుకు చెందిన వ్యవసాయ బావి నుంచి నీళ్లు తీసుకొస్తున్నాం. మా గ్రామం నుంచి రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది. వెళ్ల్లడానికి దారి కూడా సరిగా లేదు. ఎడ్లబండ్లపై ట్యాంకులు ఏర్పాటు చేసి వ్యవసాయ బావికి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నాం. కలెక్టర్ మామిడిగూడ(బీ)పై దృష్టి సారించి నీటి సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలి.
– వెట్టి లక్ష్మణ్, మామిడిగూడ(బీ) గ్రామస్తుడు