నార్నూర్ : ఏజెన్సీ ప్రాంతంలో అమాయక గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కల్తీ ( Adulteration) , నకిలీ పదార్థాలు, సరుకుల విక్రయాలకు నిరసనగా ఆదివాసి విద్యార్థి సంఘం (Tribal student ) శనివారం మండల కేంద్రంలో నిరసన ( Protest ) తెలిపింది. సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండల కేంద్రంలోని కుమ్రం భీం చౌరస్తా వద్ద గడువు చెల్లిన, నకిలీ, కల్తీ సరుకులతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతం నార్నూర్, గాదిగూడ మండల కేంద్రంతో పాటు లోకారి, తాడిహత్నూర్, మేడిగూడ మార్కెట్లో, వారపు సంతలలో బడా, చిరు వ్యాపారస్తులు దుకాణాలలో గడువు చెల్లిన, కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలు, సరుకులు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోకపోవడం శోఛనీయమన్నారు.
ఆహారభద్రత శాఖ అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టారీతిన విక్రయాలు చేస్తూ నిరక్షరాస్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సంబంధిత శాఖ అధికారులు స్పందించి మార్కెట్లోని దుకాణాలు, సంతలలో తనిఖీలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘాల నాయకులు మనోహర్, కనక ప్రభాకర్, మడవి చంద్ర హరి, మడవి యశ్వంత్ రావు, మెస్రం వామన్,మర్ప గంగా రామ్, మెస్రం సంతోష్,కోడప లింగు,మారు, తిరుపతి, శంకర్, దాదిరావ్, శ్యాం రావ్, అజయ్ తదితరులున్నారు.