మంచిర్యాల, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా గిరిజన సంక్షేమ శాఖ బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు తెలుస్తున్నది. ఇటీవల రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో జోన్-1లో పని చేసే గ్రేడ్-1, గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల(వార్డెన్)లను బదిలీ చేశారు. జోన్-1లో మొత్తం 12 మంది బదిలీ కాగా, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హాస్టల్లో పని చేసే వార్డెన్ లక్షెట్టిపేట గర్ల్స్ హాస్టల్‌కు, మంచిర్యాల పోస్ట్ మెట్రిక్ ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో పని చేసే వార్డెన్ జన్నారం బాయ్స్ హాస్టల్‌కు బదిలీ అయ్యారు.
గత నెల జూలై 21న బదిలీపై వెళ్లి అక్కడి హాస్టళ్లలో జాయిన్ అయిన వార్డెన్లు నెల రోజులు మంచిర్యాలలోని పాత హాస్టళ్లలోనే పని చేస్తున్నారు. ఈ విషయంపై మంగళవారం ఉదయం ‘నమస్తే తెలంగాణ’ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గంగారాంను వివరణ కోరగా.. క్లాస్-4 ఉద్యోగులకు మంచిర్యాలలోని హాస్టళ్లలో పోస్టింగ్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా సూచనల మేరకు వీరిని పాత హాస్టళ్లలోనే కొనసాగిస్తున్నామన్నారు. వీరి స్థానంలో రిలీవర్స్ రాగానే బదిలీపై వెళ్తారని, రెండు మూడు రోజుల్లో ఆదేశాలు రావొచ్చని చెప్పారు. కాగా, ఇదే మంగళవారం లక్షెట్టిపేట గర్ల్స్ గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పీవో ఖుష్బూగుప్తా మాత్రం వార్డెన్ విధుల్లో లేకపోవడంపై మండిపడ్డారు.
గత నెల 21న జాయిన్ అయిన వార్డెన్ నెలరోజులకు పైగా విధులకు రాకుండా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గంగారం చెప్పినట్లు బదిలీపై వెళ్లని వార్డెన్ల విషయం ఐటీడీఏ పీవో దృష్టిలో ఉంటే.. ఎందుకు సీరియస్ అయ్యారు. వార్డెన్‌కు షోకాజ్ నోటీసులు ఎందుకు ఇచ్చారనేది అర్థం కావడం లేదు. బదిలీపై వెళ్లని వార్డెన్ల విషయంలో సమాచారం ఇవ్వకుండా ఐటీడీఏ పీవోను జిల్లా అధికారులు తప్పుదోవ పట్టించినట్లు దీనిని బట్టే అర్థం అవుతున్నది.
అర్హులకు అన్యాయం..
ప్రస్తుతం బదిలీపై వెళ్లిన హాస్టల్ వె ల్ఫే ర్ అధికారుల స్థానంలో అర్హులై న క్లాస్-4 ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వా లి. ఈ మేరకు గిరిజన సంక్షే మ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇవేవీ మం చిర్యాల జిల్లా అధికారులకు పట్టలేదు. ఇప్పుడు బదిలీలైనా మంచిర్యాల గర్ల్స్ హాస్టల్, పోస్ట్ మెట్రిక్ ఎస్టీ గర్ల్స్ హాస్టల్ సహా ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్లో మూడు ఖాళీలున్నాయి. ఈ మేరకు జిల్లాలో అర్హులైన క్లాస్-4 ఉద్యోగులు సైతం అందుబాటులో ఉ న్నారు. వారికి పోస్టింగ్ ఇస్తే ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పనైపోయేది.
కానీ క్లాస్-4 ఎంప్లాయీస్‌కు పోస్టింగ్‌లు ఇవ్వకుండా జిల్లా గిరిజిన సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు అడ్డుకుంటున్నారని అర్హులైన ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అర్హులైన తమను కాదని ఉపాధ్యాయులకు ఇన్చార్జిగా బాధ్యతలు ఇవ్వాలంటూ సదరు అధికారి ఐటీడీఏ పీవోకు నోట్‌ఫైల్ పెట్టారని, ఈ మేరకు సదరు ఉపాధ్యాయుల నుంచి లక్షలాది రూపాయలు చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేయాల్సిన అధికారులు వార్డెన్ పోస్టు కోసం అంతగా ఫైరవీలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. పిల్లలకు పాఠాలు చెప్పడం కన్నా.. లక్షలాది రూపాయలు లంచాలు ఇచ్చి వార్డెన్ పోస్టు అడగాల్సిన ఖర్మ ఏమిటనేది తెలియడం లేదు.
ఇది ఈ ఇద్దరు వార్డెన్ల విషయంలోనే కాదు.. గిరిజన సంక్షేమ శాఖలో పని చేసే ఓ అధికారికి నిర్మల్‌కు బదిలీ అయ్యింది. అక్కడికి వెళ్లి జాయిన్ అయి వచ్చిన ఆయన సైతం ప్రస్తుతం మంచిర్యాలలోనే పని చేస్తున్నారు. జీతం మాత్రం నిర్మల్‌లో తీసుకుంటున్నారు. దీనిపై సదరు అధికారిని వివరణ కోరగా.. పీవో డిప్యూటేషన్ ఇచ్చారని చెప్పారు. దానికి సంబంధించిన కాపీని ఇవ్వాలని అడిగితే మాత్రం.. అలాంటివేవీ లేవని చెప్పారు. మరి ఈ అధికారి విషయమైనా పీవో దృష్టిలో ఉందా లేకపోతే ఇది కూడా అబద్ధమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో పని చేసే కొందరు ఉపాధ్యాయులు సైతం పోస్టింగ్ ఒక దగ్గర ఉంటే.. పని మరో దగ్గర చేస్తున్నట్లు తెలిసింది. చెన్నూర్‌లో పోస్టింగ్ ఉన్న ఓ ఉపాధ్యాయుడు నెన్నెల మండలం కృష్ణపల్లిలో పని చేస్తున్నారు. ఇలా ఈ శాఖలో చాలా మంది అధికారులు బదిలీపై వెళ్లకుండా ప్రస్తుతం పని చేస్తున్న స్థానాల్లోనే తిష్ట వేసుకొని ఉన్నారని తెలుస్తున్నది.
లక్షెట్టిపేటలో విధుల్లో చేరిన వార్డెన్..
ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా మంగళవారం లక్షెట్టిపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసి, విధులకు రాని వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయంలో పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో అక్కడ జాయిన్ అయి వచ్చి మంచిర్యాలలో పాత హాస్టల్లోనే పని చేస్తున్న వార్డెన్ మల్లారెడ్డి బుధవారం హడావుడిగా వెళ్లి లక్షెట్టిపేట హాస్టల్లో విధుల్లో చేరారు. దీంతో రిలీవర్ వచ్చే వరకు మంచిర్యాలలోనే పని చేసేందుకు పీవో అనుమతి ఇచ్చారని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి చెప్పినవన్నీ అబద్ధాలని తేటతెల్లమైపోయింది.
ఇదే విషయమై వివరణ అడిగేందుకు ‘నమస్తే తెలంగాణ’ ఆయనను సంప్రదించగా.. ఐటీడీవో పీవోకు అర్హుల జాబితా పంపిస్తున్నామని, అందులో నుంచి మేడమ్ సెలెక్ట్ చేస్తారని మరో సమాధానం చెప్పారు. మంగళవారం ఆయన చెప్పిన సమాధానానికి, బుధవారం ఆయన చెప్పిన దానికి ఎక్కడా పొంతన కనిపించలేదు. వార్డెన్లు బదిలీపై వెళ్లకుండా మంచిర్యాలలోనే పని చేస్తున్న విషయం పీవో దృష్టిలో ఉంటే.. ఎందుకు పోకాజ్ నోటీసులు ఇచ్చారని అడిగేందుకు మరోసారి సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన ఫోన్లో ఆన్సర్ చేయలేదు. మరి ఇప్పటికైనా ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటారా.. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటారా.. అర్హులైన క్లాస్-4 ఉద్యోగులకు న్యాయం చేస్తారా… లేకపోతే సదరు జిల్లా అధికారి ఇచ్చిన జాబితాలోనే ఉపాధ్యాయులకే ఇన్చార్జి వార్డెన్ బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకుంటారా.. అన్నది వేచి చూడాల్సి ఉంది.