కౌటాల, మే 23 : ఆడుకుంటూ ఆరుబయటకు బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లిలో శుక్రవారం జరిగింది. తాటిపల్లికి చెందిన స్నేహితులు బోయర్ లక్ష్మి(13), షెండే హన్సిక(11), కవిత, హవి ఆడుకుంటూ ఊరు బయట చేనులోకి బహిర్భూమికి వెళ్లారు. పక్కనే ఉన్న కుంటలో తేలుతూ వాటర్ బాటిల్ కనిపించింది. దానిలో నీటిని తెచ్చేందుకు బోయర్ లక్ష్మి, షెండే హన్సి కుంటలోకి దిగారు.
నీటిపై తేలి ఉన్న బాటిల్‌ను అందుకునేందుకు లక్ష్మి ప్రయత్నం చేస్తుండగా, కాలు జారి అందులో పడింది. లక్ష్మిని కాపాడేందుకు హన్సి క చేయి అందిస్తూ ఆమె కూడా కుంటలో పడి పోయింది. పైన ఉండి గమనిస్తున్న కవిత, హవి వెంటనే ఊరిలోకి వెళ్లి కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు విషయం తెలిపారు. వారు అక్కడికి చేరుకునే సరికే చిన్నారులిద్దరూ నీట ము నిగి మృతి చెందారు. వారి మృతదేహాలను బయటకు తీశారు. విగతజీవులుగా మారిన త మ పిల్లలను చూసి తల్లిదండ్రులు క న్నీరుమున్నీరయ్యారు.
వారిలో ఒకరు తాటిపల్లికి చెందిన బోయర్ విశ్వనాథ్ కూతురు లక్ష్మి కాగా, మరొకరు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎట్టపల్లి గ్రామానికి చెందిన షెండే రత్నమాల-విజయ్‌ల కూతురు హన్సిక. వేసవి సెలవుల కోసం తాటిపల్లిలోని మేనత్త ఇంటికి పది రోజుల క్రితం వచ్చింది. మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అంబులెన్స్ తెప్పించి మృతదేహాలను సిర్పూర్(టీ) సివిల్ దవాఖానకు పంపించారు. ఎస్ఐ విజయ్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.