ఇచ్చోడ, ఫిబ్రవరి 13 : ఒకప్పుడు నగరాలు, పట్టణాలకే పరమితమైన వాలెంటైన్స్‌డే ఇప్పుడు పల్లెలకూ విస్తరించింది. పెద్దలతో పోరాడి పెళ్లిళ్లు చేసుకొని సంసారాన్ని విజయపథంలో సాగిస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకున్న ప్రేమికు లు ఉన్నారు. వివాహ బంధంలో ఇమడలేక వి డిపోయిన వారూ లేకపోలేదు. రెండు దశాబ్దాల క్రితం ప్రేమ వివాహాన్ని ఓ నేరంగా భావించేవా రు. దీంతో చెప్పకుండా గుడిలోనో, ఏ రిజిస్ట్రార్ కార్యాలయంలోనో వివాహాలు చేసుకునేవారు. దీని వల్ల అటు పెద్దలు, ఇటు ప్రేమికులు కొన్నేం డ్ల పాటు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతకు దూరమయ్యేవారు.
ప్రేమికుల రోజు వచ్చిందిలా..
క్రీ.శ. 270లో రోమ్‌లో వాలెంటైన్ అనే ప్రవక్త ఉండేవాడు. ప్రేమ వల్ల ప్రపంచం ఆహ్లాదకరంగా, ఆనందంగా మారుతుందని ఆయన అభిప్రాయం. అందుకే రహస్యంగా యువతీ యువకులకు ప్రేమోపదేశాలు చేసి ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం ప్రారంభించాడు. వాలెంటైన్‌కి రోజురోజుకూ అభిమానులు పెరిగిపోతుండడంతో రోమ్ రాజు క్లాడియస్‌కి భయం పట్టుకుంది. దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనుడిగా తయారు చేస్తున్నాడనే అభియాగంపై క్లాడియస్ వాలెంటైన్‌కు మరణ శిక్ష విధించాడు. వాలెంటైన్ అభిమానుల్లో క్లాడియస్ కుమార్తె కూడా ఉండడం విశేషం. ప్రేమకు మారుపేరుగా వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరి తీశారు. ఆ తర్వాత రెండు దశాబ్దాలకు క్రీ. శ. 496లో అప్పటి పోప్, గెలిసియన్స్ ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా ప్రకటించారు. ఎక్కడో రోమ్‌లో, అదీ దశాబ్దాల క్రితం జీవించిన ఓ క్రైస్తవ ప్రవక్త పేరుతో మొదలైన ఈ ప్రేమికుల రోజు ఇప్పుడు ప్రపంచ ప్రేమికుల దినోత్సవంగా మారిపోయింది.
తల్లిదండ్రులతో ధైర్యంగా..
ప్రస్తుతం పరిస్థితులు చాలా మారాయి. ప్రేమికులు తల్లిదండ్రులకు ధైర్యంగా తమ ప్రేమ విషయాన్ని చెబుతున్నారు. పెండ్లి చేసుకుంటున్నారు. తమ పిల్లల సంతోషం తప్పా తమకేదీ ముఖ్యం కాదనే ఆలోచనతో కులం, ఆస్తిపాస్తులు వంటి పట్టింపులు పెద్దగా చూడడం లేదు. దీంతో ప్రేమికులతో పాటు తల్లిదండ్రులు సంతోషంగా ఉంటున్నారు.
ప్రేమ పెళ్లిళ్లకు కేరాఫ్..
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నేపల్లిలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న శ్రీసదా నందహరిస్వామి ఆలయం ప్రేమ పెళ్లిళ్లకు కేరాఫ్‌గా మారింది. సదానందుడి సాక్షిగా యేటా ఇక్కడ ప్రేమ వివాహాలు జరుగుతుండడంతో ఈ ఆలయానికి కాస్త ప్రేమాలయంగా పేరొచ్చింది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో స్నేహితులతో కలిసివచ్చి ఇక్కడ ప్రేమ వివాహాలు చేసుకుంటారు. ఇప్పటి వరకు ఇక్కడ సుమారు 350 పెళ్లిల్లు జరిగినట్లు ఆలయ పురోహితులు చెబుతున్నారు.
పెద్దల అంగీకారం ఉండాలి..
గోదావరి, నేను ఒకరినొకరం ఇష్టపడ్డాం. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఇరు కుటుంబాల సభ్యులను ఒప్పించి 2008లో పెళ్లి చేసుకున్నాం. మాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారు. ప్రేమ పెళ్లి చేసుకోవడం తప్పుకాదు. కానీ పెద్దల అంగీకారం మాత్రం తప్పకుండా ఉండాలి. ఇరు కుటుంబాల సభ్యులను ఒప్పించడంతో మేం సంతోషంగా ఉన్నాం.
–కుమ్రం జంగుబాపు-గోదావరి, డ్రీమ్ సంస్థ మండల కోఆర్డినేటర్, సిరికొండ