రోడ్డు ప్రమాదం జరిగినా, ప్రసవ సేవలు అవసరమున్నా, ఆత్మహత్యకు యత్నించినా, గుండెపోటు వచ్చినా ఇతర ఏ అత్యవసరమైనా మన ముందు క్షణాల్లో ప్రత్యక్షమయ్యే 108 అంబులెన్స్‌లో పైలెట్(డ్రైవర్) పాత్ర కీలకం.
అత్యవసర సమయంలో అప్రమత్తతో విధులు
విపత్కర పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా సేవలు
నేడు 108 పైలెట్స్ డే
కోటపల్లి, మే 25 : రోడ్డు ప్రమాదం జరిగినా, ప్రసవ సేవలు అవసరమున్నా, ఆత్మహత్యకు యత్నించినా, గుండెపోటు వచ్చినా ఇతర ఏ అత్యవసరమైనా మన ముందు క్షణాల్లో ప్రత్యక్షమయ్యే 108 అంబులెన్స్‌లో పైలెట్(డ్రైవర్) పాత్ర కీలకం. విమానాలు నడిపేవారిని పైలెట్ అని పిలుస్తుండగా, మన దేశంలో అంబులెన్స్ నడిపే డ్రైవర్స్నూ పైలెట్‌గా సంబోధిస్తూ వారికి సముచిత గౌరవం అందిస్తున్నారు. బాధితులను ఘటనా స్థలం నుంచి దవాఖానకు తీసుకొచ్చే సమయాన్ని గోల్డెన్ అవర్‌గా భావిస్తున్నారు. ఈ సమయంలో పైలెట్ అప్రమత్తంగా లేకపోయినా, అంబులెన్స్ నడుపడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించాలి. రోజూ వందలాది మంది బాధితులను 108 వాహనంలో సకాలంలో దవాఖానకు తీసుకొస్తూ ఆపద సమయంలో ప్రత్యక్ష దైవాలుగా 108 పైలెట్లు మారుతున్నారు.
ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ ఎవ్వరికీ ప్రాణహాని జరగకుండా 108 వాహనాలను సకాలంలో దవాఖానకు చేరుస్తున్న వారి సేవలకు గుర్తే ఈ రోజు. కాగా.. కొవిడ్ సమయంలో రోగులను, అనుమానితులను దవాఖానకు, ఐసొలేషన్ సెంటర్‌కు తీసుకురావడం 108 సిబ్బంది పాత్ర మరువలేనిది. కొవిడ్ పేషెంట్స్‌ను తీసుకొని హైదరాబాద్ వంటి పట్టణాలకు వెళ్లినప్పుడు పైలెట్‌తోపాటు ఈఎంటీలు రోజంతా కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థతి. కొవిడ్ సమయంలో జాగ్రత్తలు తీసుకున్నా అనారోగ్యానికి గురైనప్పటికీ మెరుగైన తర్వాత వెంటనే మళ్లీ విధుల్లో చేరి వారి కర్తవ్యాన్ని నిర్వహించారు.
చాలా సంతోషంగా ఉంది..
108 వాహనాల్లో పని చేస్తూ సేవ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆపద జరిగినప్పుడు సకాలంలో ఘటనా స్థలానికి వెళ్లి, అంతకు రెట్టింపు వేగంతో బాధితులను దవాఖానకు తీసుకురావడం మా విధి. విధి నిర్వహణలో ఇబ్బంది ఎదురైనా వేలాది మందికి సేవ చేస్తున్నాం.
– ఫరీద్ అహ్మద్, కోటపల్లి(మంచిర్యాల జిల్లా)
గోల్డెన్ అవర్ చాలా కీలకం
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలానికి చేరుకొని ఆ బాధితులను దవాఖానకు తీసుకురావడాన్ని గోల్డెన్ అవర్‌గా భావిస్తాం. ఆ సమయంలో ప్రతి క్షణం చాలా విలువైనది. ఈ సమయంలో పైలెట్ అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
– అబ్దుల్ రెహమాన్(ఆదిలాబాద్ జిల్లా)
అప్రమత్తత అవసరం..
ప్రతి కేసు మాకు కత్తి మీద సాము లాంటిదే. మేం కేసు రాగానే వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకునే పనిలో ఉంటాం. ఎంత కష్టమైనా రోగిని సకాలంలో దవాఖానకు చేర్పడం మా బాధ్యత. 108 వాహనం వెళ్తున్నప్పుడు ఎదురుగా వెళ్లే వాహనాలు దారి ఇవ్వడం ద్వారా మా సమయాన్ని ఆదా చేసినవారవుతారు.
– జమీర్ అలీ, సిర్పూర్(టి),(కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా)
పైలెట్ల సేవలు కీలకం
అంబులెన్స్ నిర్వహణతో పాటు కేస్‌కు వెళ్తున్న సమయంలో అప్రతమత్తతో వాహనం నడపాల్సి ఉంటుంది. రోజూ వందల కేసులను సకాలంలో దవాఖానకు చేరుస్తున్నాం. వారందరు కూడా మెరుగైన వైద్యం తీసుకొని చిరునవ్వుతో ఇంటిబాట పడుతున్నారు. 108 పైలెట్ సేవలకు యేటా పైలెట్ డేను జరుపుకోవడం సంతోషంగా ఉంది.
– సామ్రాట్, 108, 102 అంబులెన్స్ ఉమ్మడి జిల్లా ప్రొగాం ఆఫీసర్