కొల్లాపూర్ : కొల్లాపూర్ రేంజ్ సోమశిల సెక్షన్ సరిహద్దు గ్రామాలలోని ఎంగంపల్లి తండా గ్రామ పరిధిలో పెద్దపులి ( Tiger ) సంచారం కలకలం రేపుతుంది. సమాచారం అందిన వెంటనే జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారులు డీఎఫ్వో ( DFO ), ఎఫ్డీవో ( FDO ) , ఎఫ్ఆర్వో ( FRO ) ఆదేశాల మేరకు కొల్లాపూర్ అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.
ఎంగంపల్లి తండా( Engampalli Thanda ) గ్రామ పరిసర ప్రాంతాలు, వ్యవసాయ పొలాలు, అటవీ సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు విస్తృతంగా పరిశీలనలు చేపట్టారు. ఈ పరిశీలన సమయంలో పొలాల్లో కనిపించిన పాదముద్రలు, ఇతర ఆనవాళ్లను సాంకేతికంగా పరిశీలించిన అనంతరం అవి పెద్దపులికి చెందిన జాడలేనని అటవీ శాఖ అధికారులు కాశన్న, ముజీబ్ ఘోరి నిర్ధారించారు.
ఎంగంపల్లి తండాతో పాటు అటవీ సరిహద్దు గ్రామ సర్పంచ్ గోపి నాయక్ ఆధ్యర్యంలో గ్రామాలలో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చాటింపు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పొలాల వద్ద ఒంటరిగా వెళ్లవద్దని, చిన్న పిల్లలను అటవీ ప్రాంతాల వైపు పంపవద్దని, గొర్లు, పశువులను కాపాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పులి కనిపించినా లేదా అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఎవరు కూడా పంట పొలాల్లో ఉచ్చుళ్లు గాని, కరెంట్ గాని పెడితే అటవీ చట్టం 1972 ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుం దని తెలిపారు. ప్రజల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ కొల్లాపూర్ రేంజ్ అధికారి మక్దూం హుస్సేన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శశి, నవీన్, చోటేపాషా, నాగమల్లి సిబ్బంది పాల్గొన్నారు.