కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కవ్వాల్ టైగర్‌జోన్‌ను కాగజ్‌నగర్‌కు మార్చేందుకు అధికారులు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర అటవీ శాఖ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి మహారాష్ట్ర నుంచి పులుల రాకపోకలు చేస్తున్న ప్రాంతాలను పరిశీలించింది. కాగజ్‌నగర్ అడవులు పులులకు సురక్షిత ప్రాంతంగా ఉన్నాయనడానికి ఎలాంటి అనుకూలతలున్నాయన్న అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా అధికారులకు వారు సూచించినట్లు తెలుస్తున్నది.
కవ్వాల్‌లో కానరాని పులుల నివాసం
కవ్వాల్ అభయారణ్యాన్ని 1972 వన్య ప్రా ణుల సంరక్షణ చట్టాన్ని అనుసరించి 1999 లో రిజర్వు ప్రాంతంగా మార్చారు. అడవుల్లో శాఖాహార వన్యప్రాణులు సంతతి పెరగడంతో దీనిని పులుల సంరక్షణ ప్రాంతంగా మార్చాలని భావించారు. 2012లో కవ్వాల్ అభయారణ్యాన్ని 42వ పులుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల సంతతిని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. వన్యప్రాణుల ఆహారం కోసం గడ్డిమైదానాలు, నీటి వసతులు కల్పించారు. అడవుల్లోకి వెళ్లేందుకు ఆంక్షలు విధించారు. ఆడవుల్లోకి వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు పెట్టి అడవిదారులను మూసేశారు. కవ్వాల్‌లోకి పులులు వస్తే పూర్తిగా స్వేచ్ఛగా తిరిగేలా చర్యలు చేపట్టారు. పర్యాటకులను ఆకర్శించేందుకు కాటేజీలువంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. అడవుల్లో పర్యటించేందుకు సఫారీలను ఏర్పాటు చేశారు. దాదాపు 12 ఏళ్లుగా అనేక చర్యలు చేపట్టారు. పులులను ఈ ప్రాంతానికి రప్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ.. ఇంతవరకు పులులు కవ్వాల్ అడవుల్లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నది లేదు.
కాగజ్‌నగర్ అడవులు అనుకూలం..!
మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్, కన్నెర్గాంలలో ఉన్న పులుల సంరక్షణ కేంద్రాల నుంచి కొన్నేళ్లుగా పులులు కాగజ్‌నగర్ అడవుల్లోకి విరివిగా రాకపోకలు సాగిస్తున్నాయి. 2015లో మొటిసారి ఫాల్గుణ (పులి) నాలుగు పిల్లలకు జన్మనిచ్చి కదంబా అడవుల్లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి పులుల సంచారం జిల్లాల్లో బాగా పెరిగింది. నిత్యం ఎక్కడోచోట మనుషులపై, పశువులపై పులుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్ అడవులను పులులు సంరక్షణ కేంద్రంగా మార్చడంపై అటవీ అధికారులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. 12 ఏళ్లుగా పులులు ఆవాసం ఏర్పాటు చేసుకోని కవ్వాల్ అభయారణ్యం కంటే కాగజ్‌నగర్ అడవులను పులుల సంరక్షణ కేంద్రంగా మారిస్తే బాగుంటుందన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మహారాష్ట్రలోని నుంచి ఇక్కడికి వచ్చే పులులు ఇక్కడే ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు. దట్టమైన అడవుల్లో, పులుల సంచరించే ప్రాంతాల్లో ఉన్న ఆవాసాలను గుర్తిస్తున్నారు. అడవి భూముల్లో సాగు వివరాలను సేకరిస్తున్నారు. కాగజ్‌నగర్ అడవులను పులులకు పూర్తి ఆవాస యోగ్యంగా మార్చేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలో అధ్యయనం కోసం ప్రత్యేక బృందం
పులుల సంరక్షణ కోసం తడోబా, కన్నెర్గాం, తిప్పేశ్వర్ కేంద్రాల్లో అక్కడి అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. అడవుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు.. అనే విషయాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఇక్కడి నుంచి ప్రత్యేకంగా అటవీ అధికారుల బృందాన్ని పంపించనున్నట్లు పీసీసీఎఫ్ డోబ్రివాల్ ఇటీవల కాగజ్‌నగర్ అడవుల్లో పర్యటించిన సందర్భంగా తెలిపారు. పులుల రాకపోకలు ఎక్కువగా సాగిస్తున్న ప్రాణహిత తీరం వెంబడి ఉన్న గ్రామాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.