బీఆర్ఎస్.. బీఆర్ఎస్.. బీఆర్ఎస్.. ఏ నోట విన్నా ఇదే మాట.. చివరకు కాంగ్రెస్ నాయకులు కూడా భారత రాష్ట్ర సమితిని తలచుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు.. నెల రోజులుగా గులాబీ నేతలు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సంక్షేమం, అభివృద్ధిని గడప గడపకూ వివరిస్తూ ఓటర్ల తలలో నాలుకలా మెదులుతున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ కొందరి అభ్యర్థులనే ప్రకటించగా.. ప్రచారం కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. తాజాగా.. బుధవారం కరీంనగర్ జిల్లాలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) సమక్షంలో లక్షెట్టిపేట జడ్పీటీసీ(కాంగ్రెస్) ముత్తె సత్తయ్య, తిమ్మపూర్ ఉపసర్పంచ్ ముత్తె రాజ్‌కుమార్, సీనియర్ నాయకుడు చంద్రమౌళితోపాటు మరికొందరు చేరారు. వీరి చేరికతో లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లో బీఆర్ఎస్ బలం పెరిగి, కాంగ్రెస్ బలహీన పడినట్లయింది. ఇంకా.. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు ఇతర పార్టీలలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
– మంచిర్యాల, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల సమర క్షేత్రంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులు ఎవరో తేల్చుకోలేకముందే బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నది. ఈ నేపథ్యంలో మంచిర్యాల నియోజకవర్గంలో కాం గ్రెస్ పార్టీలో కీలకమైన నాయకులుగా ఉన్న లక్షెట్టిపేట కాంగ్రెస్ జడ్పీటీసీ ముత్తె సత్తయ్య తన అనుచరులతో కలసి కరీంనగర్లో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముత్తె సత్తయ్య చేరికతో మంచిర్యాల నియోజవకర్గంలోని లక్షెట్టిపేట, దండేపల్లి మండలాలలో బీఆర్ఎస్ బలం మరింత పెరిగింది. ముత్తె సత్తయ్యతో పాటు తిమ్మపూర్ ఉప సర్పంచ్ ముత్తె రాజ్ కుమార్‌తో పాటు సీనియర్ నాయకులు సూరం చంద్రమౌళి, అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడినట్లయింది. బీఆర్ఎస్ సర్కార్ పాలనకు, కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ముత్తె సత్తయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విదానాలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు ఒంటెద్దు పోకడలు నచ్చక తాను కాంగ్రెస్ పార్టీ వీడినట్లు తెలిపారు.
మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి ఇక నుంచి భారీగా చేరికలు ఉండనున్నాయి. లక్షెటిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్‌కు ధరఖాస్తు చేసుకున్నాడు. మంచి ఓటు బ్యాంక్ ఉన్న ముత్తె సత్తయ్యను పక్కన పెట్టి, తనతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ప్రేమ్ సాగర్ రావుకు అదిష్టానం టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. లక్షెట్టిపేట, దండేపల్లి మండలాలలో మంచి ఓటు బ్యాంక్ ఉన్న ముత్తె సత్తయ్య కాంగ్రెస్ పార్టీ వీడటంతో పార్టీ ఉనికి ఈ రెండు మండలాలలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అయ్యే అవకాశం కనిపిస్తుంది. శుక్రవారం రోజున లక్షెట్టిపేటలో భారీ సభను నిర్వహించి లక్షెట్టిపేట, దండేపల్లి మండలాలకు చెందిన ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లను బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన క్యాడర్ మెల్లిమెల్లిగా బీఆర్ఎస్ పాట పడుతుండటంతో మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలం మరింత పెరుగుతోంది
కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీలలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు అధికార పార్టీ బీఆర్ఎస్లో చేరేందుకు టచ్‌లోకి వెళ్ళినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ వైపుకు మెజార్టీ నేతలు చూస్తుండగా, మరికొంత మంది నేతలు ఇతర పార్టీలో చేరి ప్రేమ్ సాగర్ రావుకు వ్యతిరేఖంగా పనిచేయాలని నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా తగ్గుతుండటంతో ఉన్న నేతలు కూడా తమదారి తాము చూసుకుంటన్నారు. బీఆర్ఎస్ జోరు పెరుగుతుండంతో మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయిందని చెప్పవచ్చు.