నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 29 : నిర్మల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి వ్యక్తులు, మహిళలు, తాళం వేసిన, శివారు ప్రాంతాల ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆరు నెలల నుంచి నిత్యం ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రంలోనే నడి రోడ్డుపైనే మహిళల మెడలో నుంచి పుస్తెల తాళ్లు, బంగారు ఆభరణాలను దుండగులు లాక్కెళ్తున్నారు. ఒకటి, రెండు ఇండ్లలో వరుస చోరీలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్, నగదు లాక్కెళ్లడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెట్రోలింగ్, నిఘాను పోలీసులు పటిష్టం చేసినట్లయితే దొంగతనాలకు అడ్డుకట్ట పడే అవకాశాలు ఉన్నాయి.
హడలెత్తుతున్న జనం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజుల్పేట్ కాలనీలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో గత మంగళవారం ఒకేసారి రెండు ఇండ్లలోకి దొంగలు చొరబడి నగదు, నగలు అపహరించుకు పోయారు. కాలనీకి చెందిన షేక్ సాబీర్ ఇంట్లో ఎవరూ లేనిది చూసి రూ.20 వేలు, మూడు తులాల బంగారం దోచుకెళ్లారు. అతని ఇంటి పక్కనే గల అన్వర్ ఇంట్లోకి చొరబడి బీరువాలోని రూ.6 వేలు, రెండు బంగారు రింగ్‌లను ఎత్తుకెళ్లారు.
కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన పడాల గంగవ్వ ఇంట్లో రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మూడు తులాల బంగారం,10 తులాల వెండి, రూ.1.50 లక్షల నగదును దోచుకెళ్లారు. నిర్మల్ పట్టణంతోపాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ఓ మూడు వైన్సుల షట్టర్లను పగుల గొట్టి మద్యం, నగదును అపహరించుకుని పోయారు.
జనవరి 30న నిర్మల్ జిల్లా కేంద్రంలో సినీ ఫక్కీలో దొంగతనం జరిగింది. లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్ గ్రామానికి నరేశ్ డబ్బుల నిమిత్తం మయూరి హోటల్ వద్ద గల యూనియన్ బ్యాంకుకు వచ్చాడు. బ్యాంకు నుంచి రూ. 5 లక్షలు డ్రా చేసి బైక్ బాక్స్‌లో పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా దుండగుడు డబ్బును దోచుకెళ్లారు.
రద్దీ ప్రదేశాలే టార్గెట్
దొంగలు తమ పనులను సులువుగా కానిచ్చేందుకు రద్దీ ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా అదును చూసుకుంటూ తమ పనిని కానిచ్చేస్తున్నారు. బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్ ఏరియాలు, తాళం వేసిన ఇండ్లు, వృద్ధులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పతున్నారు. నిర్మల్ పట్టణంలోని మయూరి హోటల్ ముందర మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును అపహరించుకుని పోయారు.
జనవరి 15వ తేదీన స్థానిక శివాజీ చౌక్‌లో జంగయ్య రూ.50 వేల నగదుతో నడుచుకేంటూ వెళ్తుండగా దోచుకెళ్లారు. దొంగలు ఇండ్లతోపాటు ఆలయాలను వదలడం లేదు. అందిన కాడికి దోచుకుని వెళ్లడమే లక్ష్యంగా తమ పని కానిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ భక్త హనుమాన్ ఆలయంలో దొంగతనం చోటు చేసుకుంది. ఆలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ దొంగతనాన్ని మాత్రం వదలలేదు. సీసీ కెమెరాల వైర్లను కత్తిరించి కెమెరాలను పైకి తిప్పి ఆలయం తాళం పగులగొట్టి, హుండీలోని నగదును దోచుకెళ్లారు.
దొంగనోట్ల కలకలం
జిల్లాలో ఎక్కడో ఒకచోట గొలుసు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో జిల్లా కేంద్రంలోనే పట్ట పగలే పలు గొలుసు దొంగతనాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఒంటరిగా వెళ్లే మహిళలు, వృద్ధులు, నిర్మానుష్య ప్రదేశాల్లో తిరిగే ప్రజలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. బైక్‌లపై వచ్చి మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లే క్రమంలో నగలు పోవడంతోపాటు మహిళలకు గాయాలు అవుతున్నాయి.
ఇదిలా ఉండగా నిరక్ష్యరాస్యులైన కూరగాయల వ్యాపారులకు దొంగనోట్ల అంటగడుతూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రెండు, మూడు నెలల క్రితం పట్టణంలోని కూరగాయల మార్కెట్లో వృద్ధుడి వద్దకు వచ్చిన వ్యక్తి రూ.200 నోటుని ఇచ్చి వెళ్లి పోయాడు. కొన్ని రోజుల తరువాత మంజులాపూర్ కూరగాయల మార్కెట్లో నకిలీ నోట్లను అంటగట్టే క్రమంలో వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదు చేశారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లేటప్పుడు ఇండ్లలో విలువైన బంగారం, వెండి ఆభరణాలు నగదును ఉంచి వెళ్లకండి. చాలా వరకు దొంగలు వీటి కోసమే దొంగతనాలకు పాల్పడుతున్నారు. అలాగని ప్రయాణం చేసేటప్పుడు వెంట తీసుకుపోవద్దు. వాటిని లాకర్లలో దా చుకోవాలి. లాకర్ సదుపాయం లేని వాళ్లు దొంగలు ఊహించని ప్రదేశాల్లో దాచుకోవాలి.
దొంగతనాల కట్టడికి స్పెషల్ టీం
దొంగతనాల నివారణకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశాం. ప్రతీ టీంలో ఎస్సై స్థాయి అధికారితోపాటు నలుగురు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తారు. పూర్తిగా దొంగతనాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. పట్టణం, నగరం, గ్రామాలు, వార్డుల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల వివరాలను పోలీసులకు తెలిపితే మీ ప్రాంతంలో దొంగతనాలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు.
– జానకి షర్మిల, ఎస్పీ, నిర్మల్.