చెన్నూర్/నస్పూర్, మే 12 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను కలెక్టర్ బదావత్ సంతోష్ డీసీపీ అశోక్‌కుమార్,ఆర్డీవో రాములు, ఏసీపీ ప్రకాశ్‌తో కలిసి సందర్శించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పంపిణీ చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం జరగనున్న పార్లమెంట్ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో తగిన సౌకర్యాలు కల్పించామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. చెన్నూర్ పట్టణ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ సందర్శించారు. రిటర్నింగ్ అధికారి చంద్రకళతో ఏర్పాట్లపై చర్చించారు. డీసీపీ అశోక్‌కుమార్, ఏసీపీ వెంకటేశ్వర్లు పోలింగ్ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు.
అప్రమత్తంగా ఉండాలి
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం నస్పూర్‌లోని కలెక్టరేట్లోని కంట్రోల్‌రూమ్‌ను అదనపు కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రస్తుత సమయం అత్యంత కీలకమన్నారు. పోలింగ్ కేంద్రాల్లోని సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌లో అంతరాయం కలగకుండా విద్యుత్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, నిరంతరం ఇంటర్నెట్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి పిన్న రాజేశ్వర్, ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
లంబాడీతండా (కే) పోలింగ్ కేంద్రం పరిశీలన
కాసిపేట, మే 12 : పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్ పేర్కొన్నారు. ఆదివారం కాసిపేపట మండలంలోని లంబాడీతండా(కే) గ్రామ పంచాయతీలోని మండల పరిషత్ పాఠశాలలోగల పోలింగ్ కేంద్రాన్ని డీసీపీ అశోక్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఆయన వెంట కార్యదర్శి సురేశ్, ఎన్నికల సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.