బాసర, నవంబర్ 16 : బాసర ట్రిపుల్ ఐటీ వద్ద శనివారం హై టెన్షన్ నెలకున్నది. స్వాతిప్రియ ఆత్మహత్య ఘటనలో ఏబీవీపీ కార్యకర్తపై జరిగిన దాడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ కార్యకర్తలు శనివారం బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడి కార్యక్రమం చేపట్టారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ జానకీ షర్మిల, భైంసా అడిషనల్ ఎస్పీ అవినాశ్‌కుమార్, సీఐలు, ఎస్సైలు దాదాపు 250 మంది పోలీసు సిబ్బంది ఉదయం ఐదు గంటలకే బాసర చేరుకుని రైల్వే, బస్ స్టేషన్ ప్రాంతాల్లో దిగిన అనుమానితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొందరు ఏబీవీపీ కార్యకర్తలు ట్రిపుల్ ఐటీ వెనుక భాగంలో గల రైల్వేట్రాక్ నుంచి దాదాపు 40 మంది కార్యకర్తలు నినాదాలు చేస్తూ పరిగెత్తుతూ ట్రిపుల్ ఐటీ ప్రహరీ ఎక్కడానికి ప్రయత్నించారు.
సమాచారం తెలుసుకున్న పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని అరెస్టు చేశారు. అందులో 15 మంది గోడ దూకి లోపలికి వెళ్లగా లోపల కూడా అరెస్టు చేశారు. ఇటు బాసర ఆలయంలో కూడా అనుమానితులను అరెస్టు చేశారు. ఆలయంలో కొందరు ఏబీవీపీ కార్యకర్తలు తమకు అమ్మవారి దర్శనం కూడా చేసుకోనిస్తలేరని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో భక్తులకు కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి. దాదాపు 200ల మందికిపై గా ఏబీవీపీ కార్యకర్తలను బాసరలో అరెస్టు చేశారు. కాగా.. ఎస్పీ జానకీ షర్మిల ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెయిన్ గేట్ ఎదుటే ఉన్నారు. ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న సిబ్బంది ఐడీ కార్డులు ఉంటేనే లోనికి అనుమతించారు. మీడియాకు ఇక్కడ అనుమతి లేదంటూ పోలీసు సిబ్బంది అన్నారు. ట్రిపుల్ ఐటీ లోపల అంత ప్రశాంతంగా ఉందని విద్యార్థులు క్లాసులకు, ల్యాబ్‌లకు హాజరవుతున్నారని తల్లిదండ్రులు కంగారు పడొద్దని ఎస్పీ అన్నారు.