సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వేలం వేయడంపై కార్మికులు, ఆయా సంఘాల నాయకులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనులపై ఆందోళనలు చేపట్టారు. ధర్నాలు నిర్వహించి.. నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి జోలికొస్తే ఊరుకునేది లేదని, కేంద్రం తగ్గకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
– మంచిర్యాల, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
శ్రీరాంపూర్, జూన్ 21 : శ్రీరాంపూర్ ఆర్కే 7గనిపై టీబీజీకేఎస్ నాయకులు రాజు నాయక్, బిరుదు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గనులను సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ సర్కారు పదేళ్లుగా సింగరేణి గనులను వేలం వేయాలని కుట్రలు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుందని గుర్తు చేశారు. అలాగే సింగరేణి సంస్థకే గనులు కేటాయించాలని డిమండ్ చేస్తూ శుక్రవారం శ్రీరాంపూర్‌లో జీఎం ఆఫీస్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్‌రావు, సహాయ కార్యదర్శి కొంరయ్య ఆధ్వర్యంలో జీఎం సంజీవరెడ్డికి వినతి పత్రం ఇచ్చారు.
కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన 10 రోజుల్లోనే సింగరేణి గనులను ప్రైవేట్‌పరం చేయడానికి వేలం నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమాల్లో నాయకులు సారయ్య, లక్షణ్, మోతె లచ్చన్న, రాజయ్య, రాంచందర్, వేణు, రాజేందర్, రేగుల శ్రావణ్, ప్రతాప్, రాజు, వంశీకృష్ణ, సునీల్‌కుమార్, రవీందర్ ఉన్నారు. శ్రీరాంపూర్ ఆర్కే న్యూటెక్, ఆర్కే-7 గనులపై ఐన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్ నాయకులు ఆందోళనలు చేశారు. ఆర్కే-7పై ఐన్టీయూసీ ఉపాధ్యక్షుడు శంకర్రావు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి గరిగె స్వామి, టీబీజీకేఎస్ నాయకులు రాజూనాయక్, సీఐటీయూ పిట్ కార్యదర్శి పెరుక సదానందం, డివిజన్ ఆర్గనైజర్ కస్తూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సింగరేణికి గనులు ఇవ్వకుండా జాప్యం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఏరియా కార్యదర్శి వెంగళ కుమారస్వామి, పిట్ కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు తిరుపతి, భూపతి, అశోక్, వెంకన్న, పేరం రమేశ్, ప్రేమ్‌కుమార్, సీఐటీయూ నాయకులు సందీప్, ప్రతాప్, ప్రణయ్ పాల్గొన్నారు.
మందమర్రి, జూన్ 21 : మందమర్రి ఏరియాలోని అన్ని గనులు, విభాగాలపై శుక్రవారం ఏఐటీయూసీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం గనులు, విభాగాల అధికారులకు వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, ఏరియా ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 60 బొగ్గు గనులను టెండర్ ప్రక్రియ ద్వారా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నిందన్నారు. అందులో భాగంగా సింగరేణిలో పలు గనులను కూడా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకు సిద్ధమవుతుందని మండిపడ్డారు.
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పటికైనా టెండర్ ప్రక్రియను విరమించి తెలంగాణకు గుండెకాయలాంటి సింగరేణి సంస్థను కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో అన్ని సంఘాలను కలుపుకుని సమ్మెకైనా వెనుకాడబోమని హెచ్చరించారు. ఏఐటీయూసీ బ్రాంచ్ సహాయ కార్యదర్శి సోమిశెట్టి రాజేశం, కేకే ఓసీ మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జ్ సత్యనారాయణ, గాండ్ల సంపత్, రాంచందర్, భూమయ్య, ఊదరి శ్రీకాంత్, పారిపెల్లి రాజేశం, రాజశేఖర్, రాజయ్య, కుమార్ ఉన్నారు. మందమర్రి ఏరియాలోని కేకే-5గని వద్ద ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టయ్య మాట్లాడుతూ 139 ఏండ్ల చరిత్ర కలిగిన సింగరేణిని టెండర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మందమర్రి ఏరియాలోని కేకే-5 గని వద్దకు వచ్చిన ఐక్య కార్మిక సంఘాల నాయకులను గని మేనేజర్ అల్లావుద్దీన్ అడ్డుకున్నారు. అయినా సంఘాల నాయకులు గని ముఖ ద్వారం వద్ద నిరసన తెలిపారు. గని మేనేజర్ కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆయనపై సీఎండీ బలరాం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు పార్వతి రాజిరెడ్డి, సుదర్శన్, శ్రీనివాస్, ఐఎఫ్టీయూ నాయకులు కృష్ణ, జాఫర్, బ్రహ్మానందం, రామన్న పాల్గొన్నారు.
కాసిపేట, జూన్ 21 : మందమర్రి ఏరియాలోని కాసిపేట గనిపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బొగ్గు గనులను ప్రైవేట్‌పరం చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేశ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చొప్పరి శ్రీహరి, రాజన్న, రాజేందర్, ఆడెపు రవీందర్, కే సంతోష్ పాల్గొన్నారు.
హైదరాబాద్ వేదికగా దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా, కార్మికలోకం సమ్మెకు సిద్ధమవుతున్నది. సంస్థలో 20 వేల మంది 35 నుంచి 45 యేళ్లు ఉన్న వారున్నారు. కంపెనీ వేలంలో పాల్గొని బావులు రాక ప్రైవేట్‌కు వెళ్తే.. ఉన్న బావులు అయిపోయాక ఈ 20 వేల మంది భవిష్యత్తు ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతున్నది. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా దశలవారీగా నిరసనలు వ్యక్తం చేస్తామని, అప్పటికీ మార్పు రాకపోతే సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు.
సింగరేణిని కాపాడుకోవా లంటే వేలాన్ని అడ్డుకో వాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మీటింగ్‌కు పిలిచారు. ఆయనతో మాట్లాడాక ఈ విషయంపై కార్యచర ణ ప్రకటిస్తాం. జేఏసీతో కలిసి పనిచేయడమా.. ఒంటరిగా వెళ్లడమా అనేది నిర్ణయం తీసు కుంటాం. బొగ్గుగనుల వేలాన్ని ఆది నుంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ వ్యతిరేకిస్తూ వచ్చాయి. గతంలో ప్రధానమంత్రి మోదీకి అనేక లేఖలు రాశాం. కార్మికుల పక్షాన నిలబడి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేశాం. ఇప్పుడు అదే చేస్తాం. కార్మికులు అధైర్య పడొద్దు. దశలవారీ కార్యచరణను కేటీఆర్‌తో మీటింగ్ అయ్యాక ప్రకటిస్తాం. కార్మికలోకం కలిసి రావాలని కోరుతున్నాం. – రాజిరెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు