SPM | కాగజ్‌నగర్, డిసెబర్ 29 : సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికల కోసం నిరీక్షణ తప్పడం లేదు. పాత యాజమాన్యం నిర్లక్ష్యంతో 2014 సెప్టెంబర్‌లో మిల్లు మూతపడగా, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో 2018 ఆగస్టులో పున:ప్రారంభమైంది. మిల్లు తెరచుకొని ఆరేళ్లు కావస్తున్నా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడంతో కార్మికులు నిరాశచెందుతున్నారు. ఎన్నికలు పూర్తయితే క్యాంటీన్ సౌకర్యం, కొత్తగా యువతకు ఉద్యోగావకాశాలు, మృతుల కుటుంబాలకు రావాల్సిన బెనిఫిట్స్‌తో పాటు తదితర సౌకర్యాలు అందుతాయని కార్మికులు భావిస్తున్నారు.
లేబర్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన ఆర్ఎస్పీ
ఎన్నికల విషయాన్ని ఇటీవల బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హైదరాబాద్ లేబర్ కమిషనర్ కృష్ణాదిత్య దృష్టికి తీసుకెళ్లారు. అందుకు ఆయన స్పందించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆదిలాబాద్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 14 సంఘాలకు సంబంధించిన ఆన్యూవల్ రిటర్న్స్ సబ్మిట్ చేయాలని డిప్యూటీ కమిషనర్ నుంచి పిలుపువచ్చింది. అయితే.. గుర్తింపు కార్మిక సంఘం నాయకులు పత్రాలు అందించి మూడు నెలలు గడుస్తున్నా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించకపోవడంతో కార్మికులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధకారులు స్పందించి ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘం, కార్మికులు కోరుతున్నారు. కాగా, మిల్లు యాజమాన్యమే ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రహస్య ఒప్పందం?
పేపర్ మిల్లులో కార్మికుల వేతన ఒప్పందాన్ని రహస్యంగా నిర్వహించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాత యాజమాన్యం రెండేళ్ల వేతన ఒప్పందం చేసుకుంటే.. ప్రస్తుత యాజమాన్యం రెండు దఫాలు నాలుగేళ్ల కార్మిక వేతన ఒప్పందం చేసుకున్నదని తెలుస్తున్నది. మిల్లులో ఎలాంటి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగక పోవడంతో యాజమాన్యం అనుకూల కార్మికులతో అడహక్ కమిటీ ఏర్పాటు చేసి.. వరంగల్ జాయింట్ లేబర్ కార్యాలయంలో రహస్యంగా అగ్రిమెంట్ చేసుకున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. వేతన ఒప్పంద పత్రాలు సైతం బహిరంగం చేయడం లేదని, కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అందడం లేదని వారు పేర్కొంటున్నారు. గతంలో కార్మికులకు ఏడాదిలో 30 రోజులు సెలవులు ఇస్తే.. ప్రస్తుతం ఏడాదిలో కేవలం 26 రోజులే ఇస్తున్నారని, ఇక్కడ మిల్లులో కార్మిక చట్టాలు అమలు కావడం లేదని, గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగితేనే తమకు న్యాయం జరుగుతుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.