తాండూర్, నవంబర్ 12 : కోడిగుడ్డు ధర కొండెకి కూర్చున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు చోట్ల రూ. 7కు చేరింది. వినియోగంతో పాటు ధర పెరిగింది. అంతకుముందు రూ.5 ఉన్న ఎగ్ ప్రస్తుతం రూ. 6 నుంచి 7 వరకు ఎగబాకింది. పెరిగిన ధరలతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. మారెట్లో డిమాండ్‌కు తగ్గట్లు కోడిగుడ్ల సరఫరా లేకపోవడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ తగ్గినా పెరిగిన గుడ్ల ధరలు..వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. .ప్రస్తుతం బహిరంగ మారెట్లో కిలో చికెన్‌కు రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గింది. ఒకవైపు చికెన్ ధరలు తగ్గగా కోడిగుడ్ల రేటు పెరిగింది.
తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మాసం వరకు బర్డ్ ఫ్లూ వ్యాధితో వేలాది కోళ్లు చనిపోయాయి. కొత్తగా లేయర్స్ కోడిపిల్లలను తెచ్చి ఫారాల్లో పెంచలేదు. దీంతో సరఫరా తగ్గినట్లు తెలుస్తున్నది. సహజంగా చలికాలంలో కోడిగుడ్ల వినియోగం 20 నుంచి 30 శాతం పెరుగుతుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రొడక్షన్ తగ్గడంతో రేట్లు పెరిగాయి. కోళ్ల రైతులు ఒకో గుడ్డును రూ. 5.55 కు వ్యాపారులకు విక్రయిస్తుండగా, వారు రవాణా ఖర్చులతో కలిపి రూ. 6కు కిరాణా షాపుల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. బహిరంగ మారెట్లోకి వచ్చే సరికి ఒకో గుడ్డు రూ. 6.50 నుంచి రూ. 7కు విక్రయిస్తున్నారు. కోడిగుడ్ల వినియోగం పెరిగిందని, గిరాకీకి తగినట్లు సరఫరా లేదని, దీంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.